కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు... చంద్రబాబు కీలక సూచనలు!
ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
By: Tupaki Desk | 11 Aug 2024 6:00 AM GMTకర్ణాటకలో శనివారం రాత్రి తుంగభద్ర డ్యామ్ గేటు వరదలకు కొట్టుకుపోయింది. హోస్పేట వద్ద ఉన్న చైన్ లింక్ తెగడంతో 19వ గేటు కొట్టుకుపోయింది. ఫలితంగా.. సుమారు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయిందని అంటున్నారు. షిమోగలో వర్షాల కారణంగా తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ సమయంలో కర్నూలు జిల్లా అధికారులను అలర్ట్ చేశారు.
అవును... కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేటు వరదలకు కొట్టుకుపోయింది. వరదనీరు పోటెత్తడంతో ఇటీవల డ్యామ్ గేట్లు తెరిచారు. తిరిగి ఇన్ ఫో తగ్గడంతో వాటిని మూసే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఈ క్రమంలోనే 19వ గేటు ఊడిపోయిందని తెలుస్తోంది. ఈ సమయంలో దాని చైన్ తెగి గేటు మొత్తం వరదనీటిలో కొట్టుకుపోయిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో.. దీని ప్రభావం కర్నూలు జిల్లాపై కూడా పడే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కర్నూలు జిల్లాకు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా... మంత్రాలయం, కౌతాలం, కోసిగి, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సీఎం చంద్రబాబు ఆరా!:
కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు.
ఈ సందర్భంగా స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు... లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాలతో ఇంజినీర్ల టీమ్, సెంట్రల్ డిజైన్ కమిషనర్ ఘటనాస్థలికి వెళ్లారని మంత్రి తెలిపారు.
ఇదే సమయంలో... డ్యామ్ అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యవుల కేశవ్ ను చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా తత్కాలిక గేటు ఏర్పాటుపై మాట్లాడాలని, దానికి తగిన సహకారం అందించాలని బాబు సూచించారు.