టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక పదవులు.. రీజనేంటంటే!
అయితే.. పొత్తులో భాగంగా ఎక్కువ మందికి టికెట్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీంతో చంద్రబాబుకు కొన్నాళ్లు ఆయా నేతల నుంచి సెగ తగులుతోంది.
By: Tupaki Desk | 26 March 2024 2:50 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు .. తన పార్టీలోకి కొందరు నేతలకు కీలక పదవులు అప్పగించారు. అయితే.. ఎందుకిలా అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే సందేహం రావొచ్చు. వీరంతా కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంటు సీట్లను కోరుకున్నవారే కావడం గమనార్హం. అయితే.. పొత్తులో భాగంగా ఎక్కువ మందికి టికెట్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీంతో చంద్రబాబుకు కొన్నాళ్లు ఆయా నేతల నుంచి సెగ తగులుతోంది. ఇది పెరిగి పెద్దదైతే.. ఎన్నికల వేళ ఇబ్బందులు తప్పవని గ్రహించిన చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకుల్లో కొందరికి పార్టీలోని కీలక పదవులకు ఎంపిక చేయడం గమనార్హం.
+ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యంను పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. ఆయన రామచంద్రాపురం టిక్కెట్ ఆశించారు. ఆ స్థానం జనసేన పార్టీకి ఇవ్వకపోయినప్పటికీ వాసంశెట్టి సుభాష్ కు అవకాశం కల్పించారు. దీంతో రెడ్డి సుబ్రహ్మణ్యం అసంతృప్తికి గురి కాకుండా పొలిట్ బ్యూరో పదవి ఇచ్చారు.
+ మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన జవహర్ కు సొంత పార్టీలో అసమ్మతి ఎక్కువ కావడంతో టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. పార్టీ కోసం పని చేసేలా కీలక పదవి ఇచ్చారు. మరి ఈయన శాంతిస్తారో లేదో చూడాలి.
+ విశాఖపట్నం పార్లమెంట్ అెధ్యక్షుడుగా గండి బాబ్జీని నియమించారు. పార్టీ తొలి జాబితా ప్రకటించిన రోజునే తనకు టికెట్ దక్కలేదని భావించిన ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. గాజువాక సీటును ఆయన ఆశించారు. ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత విశాఖ పార్లమెంట్ అభ్యర్తి భరత్ ఆయనను బుజ్జగించి రాజీనామా ఉపసంహరించుకునేలా చేశారు. ఇప్పుడు విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు.
+ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులుగా బీవీ వెంకటరాముడిని నియమించారు. ఆయన గుంతకల్లు లేదా హిందూపురం ఎంపీ టిక్కెట్ ను ఆశించారు. కానీ, పొత్తులో భాగంగా ఇది బీజేపీ లేదా జనసేనకు ఇవ్వనున్నారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు కూడా పార్టీ పదవిని అప్పగించారు.
+ టీడీపీలో ఉన్న సీఎం సురేష్ కూడా కడప జిల్లాలో ఏదో ఓ సీటు ఆశించారు. ఆయనకు పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇచ్చి బుజ్జగించారు. ఈయన మైదుకూరు టికెట్ ఆశించారు. దీనిని యనమల రామకృస్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్‌కు ఇచ్చారు.
+ కర్నూలు జిల్లా డోన్ సీటు ఆశించిన మన్నె సుబ్బారెడ్డికి సీటు కేటాయించలేకపోయారు. ఆయనకూ పార్టీ కార్యనిర్వహాక కార్యదర్శి పదవి ఇచ్చారు.
+ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు, ముదునూరి మురళీకృష్ణంరాజు, వాసురె్డ్డి ఏసుదాసులకు పార్టీ పదవులు ఇచ్చారు. ఏలూరు ఎంపీ టిక్కెట్ ఆశించిన మాగంటి బాబు తనకు అన్యాయం జరిగిదంని వాపోయారు. ఆయనకు ఎంపీ టిక్కెట్ కాకపోతే కైకలూరు టిక్కెట్ ఇస్తారని అనుకున్నారు. కానీ కైకలూరు బీజేపీకి వెళ్లింది. దీంతో ఆయన అసంతృప్తి గురయ్యారు. మాగంటి బాబు వైసీపీలో చేరే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.