ఎమ్మెల్యేలను పక్కన పెట్టి.. ఎంపీలకు చంద్రబాబు కీలక బాధ్యత ..!
సాధారణంగా రాష్ట్రానికి సంబంధించి అంశాలపై ఎమ్మెల్యేలకు ఎక్కువగా బాధ్యత ఉంటుంది.
By: Tupaki Desk | 19 July 2024 7:10 AM GMTసాధారణంగా రాష్ట్రానికి సంబంధించి అంశాలపై ఎమ్మెల్యేలకు ఎక్కువగా బాధ్యత ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చే విషయంలో ఎంపీలకు బాధ్యత ఉంటుంది. అయితే.. తాజాగా సీఎం చంద్రబాబు తన ఎమ్మెల్యేలు తాను కాకుండా 134 మందిని పక్కన పెట్టేసి.. రాష్ట్రానికి సంబంధించిన ఓ కీలక బాధ్యతను ఎంపీలపై పెట్టారు. ఇదేమీ కేంద్రానికి-రాష్ట్రానికి ముడిపెట్టిన విషయం కాదు. కేవలం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమే. మరి ఆయన ఎందుకలా ? చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
విషయం ఏంటంటే..
ప్రస్తుతం కూటమి సర్కారు సూపర్-6 పథకాలను అమలు చేయాల్సి ఉంది. వీటిలో పింఛన్ల పెంపుదలను మాత్రం అమలు చేశారు. వచ్చే నెల 1న కూడా అమలుకు రెడీ అయ్యారు. కానీ, అసలైన పథకాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇవన్నీ.. భారీ ఎత్తున నిధులతో కూడి ఉన్నాయి. అమ్మకు వందనం, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.20 వేలు, 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 1500 చొప్పున ప్రతినెలా అందించడం, ఇక, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3000 చొప్పున ఇవ్వాల్సి ఉంది.
కానీ, వీటికి ప్రభుత్వం దగ్గర నిధులులేవు. అయితే.. వీటిని నేరుగా చంద్రబాబు చెప్పలేక.. ఎంపీలకు బాధ్యత అప్పగించారు. రాష్ట్రంలో కూటమి సర్కారుఎదుర్కొంటున్న సమస్యలను.. కష్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనిఢిల్లీలో సమావేశం సందర్భంగా ఆయన వివరించారు. వాస్తవానికి ఈ కష్టాలు ఆది నుంచి వున్నాయి. అయినా.. చంద్రబాబు ఇప్పుడు చెప్పమనడం వెనుక ఉద్దేశం పథకాలను కొంత ఆలస్యంగా అమలు చేసే ఉద్దేశం ఉంది.
ఇది తప్పేమీ కాదు. ప్రభుత్వ వెసులు బాటును బట్టి.. పథకాలను అమలు చేయడం ఎక్కడైనా.. ఏ సర్కారైనా చేస్తున్నదే. అయితే.. ఈ బాధ్యతను ఎమ్మెల్యేలకు కాకుండా.. ఎంపీలకు అప్పగించడం చర్చగా మారింది. ఎమ్మెల్యేలైతే.. వివాదాలకు దారితీసేలా వ్యవహరిస్తారనే ఆలోచన చంద్రబాబు చేసి ఉంటారని.. వారు ఏమాత్రం పొరపడినా.. ఇబ్బందులు వస్తాయని ఆయన వ్యూహాత్మకంగా ఎంపీలకు ఈ బాధ్యత అప్పగించి ఉంటారని అంటున్నారు. మరి ఎంపీలేమేరకు పనిచేస్తారో చూడాలి.