Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీ గల్లాకు కీలక పదవి ఇస్తున్న బాబు ?

మాజీ ఎంపీ గల్లా జయదేవ్ డీసెంట్ గా రాజకీయాల్లో పనిచేశారు. రెండు సార్లు ఆయన గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా నెగ్గారు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 3:53 AM GMT
మాజీ ఎంపీ గల్లాకు  కీలక పదవి ఇస్తున్న బాబు ?
X

మాజీ ఎంపీ గల్లా జయదేవ్ డీసెంట్ గా రాజకీయాల్లో పనిచేశారు. రెండు సార్లు ఆయన గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా నెగ్గారు. ఆయన ఎలాంటి వివాదాలు లేకుండానే పనిచేసుకుని పోయారు. ఆయనది పొలిటికల్ గా మంచి నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తల్లి గల్లా అరుణకుమారి మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఇక గల్లా జయదేవ్ ప్రముఖ సినీ నటుడు దివంగత సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు అన్నది తెలిసిందే. ప్రస్తుత సూపర్ స్టార్ మహేష్ బాబు కు బావ. అలా ఆయనకు ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న తన పని తాను చేసుకుని పోయేవారు. అలాంటి ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు. తానుగానే తప్పుకున్నారు.

అయితే ఆయన టీడీపీకి ఈ రోజుకీ సానుభూతిపరుడిగా ఉన్నారు. అవకాశం ఉంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను అని కూడా అప్పట్లోనే హింట్ ఇచ్చారు. ఇపుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో గల్లా జయదేవ్ ని మళ్లీ పొలిటికల్ గా మెయిన్ ట్రాక్ లోకి తీసుకుని రావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

గల్లా జయదేవ్ కి బాబు ఒక మంచి పోస్ట్ ని రెడీ చేసి పెట్టారని టాక్ అయితే నడుస్తోంది. ఆ పోస్టు ఏంటి అంటే ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిది. అంటే ఈ పదవి కేబినెట్ ర్యాంక్ హోదాతో ఉంటుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య వారధిగా ఉంటూ అభివృద్ధి పనుల విషయంలో కేంద్రంతో చర్చలు జరుపుతూ ఏపీకి మేలు చేసే పదవి.

ఈ కీలకమైన పదవిని గతంలో కంభంపాటి రామ్మోహన్ రావు లాంటి సీనియర్లకు బాబు ఇచ్చేవారు. ఈసారి మాత్రం ఆయన గల్లా జయదేవ్ వైపు మొగ్గు చూపుతున్నారు అని అంటున్నారు. గల్లా జయదేవ్ రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయనకు ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. పైగా తనకు అప్పగించిన పనులను ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ పోతారు అని పేరు.

దాంతో పాటు ఆయనను ఫ్యూచర్ లో మళ్లీ పార్టీలో క్రియాశీలం చేసే ఆలోచన కూడా ఉందిట. అందుకే గల్లాకే ఈ పదవి అని అంటున్నారు. గల్లా జయదేవ్ సైతం చంద్రబాబు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు. మొత్తానికి గల్లా జయదేవ్ ఎంపీగా పోటీ చేయకపోయినా ఆయనకు కేబినెట్ ర్యాంక్ పదవి అయితే రెడీ అవుతోంది. నామినేటెడ్ పదవుల పందేరంలో గల్లాకు ఈ పదవిని ప్రకటించనున్నారు అని అంటున్నారు.