చంద్రబాబుపై కేసు పెట్టిన ఎస్పీకి కీలక పోస్టింగ్.. లాబీల్లో తమ్ముళ్ల చర్చ
అంగళ్లు ఉదంతంలో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద కేసు పెట్టారన్న విమర్శ ఉంది.
By: Tupaki Desk | 26 July 2024 4:54 AM GMTచంద్రబాబు నాయకత్వంలో ఏపీలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వంలో కీలక పోస్టింగులు ఎవరికి దక్కుతున్నాయి? అన్న ప్రశ్న సహజంగానే కలుగుతుంది. దీనికి సమాధానం కూడా సింఫుల్ గా చెప్పేస్తారు ఎవరైనా. కానీ.. వారి సమాధానం తప్పు అవుతుందన్న విషయాన్ని నమ్మలేరు. తాజాగా అసెంబ్లీ సమావేశాల వేళ లాబీల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న చర్చ విన్నోళ్లు ఆశ్చర్యపోవటమే కాదు.. ఇలాంటివి చంద్రబాబుకే సాధ్యమన్న మాట వినిపిస్తోంది. అసలేం జరిగిందంటే..
అంగళ్లు ఉదంతంలో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద కేసు పెట్టారన్న విమర్శ ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రమే కాదు.. చంద్రబాబు సైతం తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని చెప్పుకోవటం కనిపిస్తుంది. గురువారం అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వతపత్రం విడుదల వేళలోనూ.. తనపై కేసులు పెట్టిన వైనాన్ని ప్రస్తావించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. లాబీల్లో చంద్రబాబుపైన కేసు కట్టిన ఎస్పీకి లభించిన అదిరే పోస్టింగ్ గురించి తెలుగు తమ్ముళ్ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది.
సాధారణంగా చంద్రబాబు నాయుడు లాంటి అధినేత మీద కేసు నమోదు చేయాలన్న నిర్ణయాన్ని చిన్నస్థాయి పోలీసు అధికారులు తీసుకోలేరు. కచ్ఛితంగా జిల్లా ఎస్పీని సంప్రదించి.. ఆయన సూచన మేరకు కేసు కట్టాల్సి ఉంటుంది. అంగళ్ల ఉదంతంలో చంద్రబాబు మీద కేసు నమోదు చేసిన వేళలో అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీగా వ్యవహరించిన ఆర్ గంగాధర్ కు ఎన్డీయే ప్రభుత్వంలో అత్యంత కీలకమైన క్రిష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారన్న చర్చ అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్ గా మారింది.
క్రిష్ణా జిల్లా ఎస్పీగా పని చేస్తున్న ఆర్. గంగాధర్ తీరు సరిగా లేదని.. ఆయన మాజీ మంత్రి కొడాలి నానికి అనుకూలంగా పని చేస్తున్నారంటూ ఉమ్మడి క్రిష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రస్తావించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి కలుగుజేసుకొని.. అంగళ్లు ఘటనను గుర్తు చేశారు. సదరు గంగాధర్ అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడే టీడీపీ నేతలు.. శ్రేణులపై అక్రమ కేసులు పెట్టేవారన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డితో అంటకాగిన విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీకి వీర విధేయుడిగా గంగాధర్ వ్యవహరించారని.. అలాంటి ఆయనకు కీలక క్రిష్ణాజిల్లా ఎస్పీ పోస్టింగ్ ఎలా ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ కు చెప్పినట్లుగా మాట్లాడుకున్నారు. ఏమైనా.. తనపై కేసు పెట్టిన ఎస్పీకి సైతం బ్రహ్మండమైన పోస్టు ఇవ్వటం చంద్రబాబుకే చెల్లుతుందన్న మాట పలువురి నోటి నుంచి వినిపించటం గమనార్హం.