బాబు మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారా ?
టీడీపీ అధినేత చంద్రబాబుకు అద్భుతమైన రోజులు రాజకీయంగా వచ్చాయి.
By: Tupaki Desk | 4 Jun 2024 10:27 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు అద్భుతమైన రోజులు రాజకీయంగా వచ్చాయి. ఏకంగా పాతికేళ్ల నాటి రాజకీయ వైభవాన్ని ఆయన జాతీయ స్థాయిలో చూడబోతున్నారు. కేంద్రంలో చూస్తే ఏ పార్టీకీ మెజారిటీ వచ్చేలా కనిపించడంలేదు.
రెండు సార్లు పూర్తి మెజారిటీ సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఈసారి చుక్కలు కనిపిస్తున్నాయి. అధికారాన్ని మూడవసారి అందుకునేందుకు చమటోడ్చాల్సిన పరిస్థితి ఉంది అని అంటున్నారు. అదే టైం లో ఎన్డీయే మిత్రులుగా ఉన్న వారిలో ఏపీ నుంచి చంద్రబాబుకు ఏకంగా 16 ఎంపీ సీట్లు వచ్చేలా ఉంది.
దాంతో ఇపుడు చంద్రబాబు ఎన్డీయే కూటమికి ఆశాదీపంగా మారుతున్నారు. ఆయనతో కేంద్ర పెద్దలు అందరూ టచ్ లోకి వస్తున్నారు. చంద్రబాబుకు ఫోన్ ద్వారా అభినందనలు తెలియచేసిన నరేంద్ర మోడీ ఆయనను ఎన్డీయే కన్వీనర్ గా చేస్తారు అని అంటున్నారు.
అంటే ఎన్డీయే మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బాబు అవసరం ఉంది అని బీజేపీ కచ్చితంగా భావిస్తోంది అన్న మాట. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు పాత్ర అత్యంత కీలకం అవబోతోంది. చంద్రబాబు తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇద్దరు ఎంపీలూ ఇపుడు ఎన్డీయేకు ఆక్సిజన్ గా మారనున్నారు అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే కనుక బీజేపీకి సొంతంగా సీట్లు ఏ విధంగా చూసినా 250 దాటేట్టుగా లేవు అని అంటున్నారు. యూపీలోనే బీజేపీ కుప్పకూలిన నేపధ్యం కనిపిస్తోంది. దాంతో ఇపుడు చంద్రబాబుతో దోస్తీయే బీజేపీని కాపాడుతుందని అంటున్నారు. బాబుని ఏదో విధంగా ఎన్డీయే కూటమిలో ఉంచుకుంటే కచ్చితంగా మూడవసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లుగా ఉంది.
మరి ఇదే సరైన సమయం ఏపీని అన్ని విధాలుగా బాగు చేసుకునేందుకు అని అంటున్నారు. ముగిసిన అధ్యాయం ప్రత్యేక హోదా అన్న బీజేపీ పెద్దల నోటి నుంచే దానిని చంద్రబాబు సాధించనున్నారా అన్నది కూడా ఒక చర్చగా ఉంది. అదే సమయంలో ఏపీకి విభజన హామీలు అన్నీ కూడా నెరవేర్చుకోవడానికి కూడా బాబుకు ఇది సువర్ణ అవకాశం అని అంటున్నారు. పొలిటికల్ గా బాబు రాజకీయ బాహుబలి అవతారం ఎత్తేశారు. దాంతో చంద్రబాబు చక్రం ఇపుడు ఢిల్లీలో గిర్రున తిరిగే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.