Begin typing your search above and press return to search.

కుప్పం బాబు సొంతం !

కుప్పం కోటను కూల్చడం ఎవరి వల్లా కాదు అని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి రుజువు చేశారు

By:  Tupaki Desk   |   4 Jun 2024 3:30 PM GMT
కుప్పం బాబు సొంతం !
X

కుప్పం కోటను కూల్చడం ఎవరి వల్లా కాదు అని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి రుజువు చేశారు. కుప్పంలో గత ఎన్నిలలో 30 వేల ఓట్ల తేడాతో గెలిచిన చంద్రబాబు ఈసారి మాత్రం 48 వేల 184 ఓట్ల తేడాతో గెలిచి విక్టరీ సింబల్ చూపించారు.

కుప్పం లో బాబు గెలుపు ఇది వరసగా ఎనిమిదోసారి. కుప్పం నుంచి ఆయన 1989లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 1994, 1999, 2004, 2009, 2014, 2019లలో కూడా మంచి విజయాలు అందుకున్నారు. ఈసారి గెలుపుతో బాబు తనకు ఎదురు లేదు అనిపించుకున్నారు.

నిజానికి కుప్పంలో బాబు గెలుపునకు అంతటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అది ఆయనకు పెట్టని కోట. కానీ 2019 తరువాత కుప్పం మీద వైసీపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడమే కాదు, ఈసారి బాబుని ఓడిస్తామని శపధం పట్టింది. లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉండడంతో కుప్పంలో కొంత కలసి వచ్చింది.

అయితే అదే నిజమనుకుని ఇక బాబు పని సరి అని కుప్పంతో సహా అన్నీ మావే అంటూ వై నాట్ 175 అని వైసీపీ నేతలు ఆర్భాటపు ప్రకటనలు చేశారు. అయితే ఇక్కడ వారు మరచిన విషయం ఏమిటి అంటే బాబుకు కుప్పంతో ఉన్న ఎమోషనల్ బాండేజ్. కుప్పం ప్రజల గుండెలలో అది గూడు కట్టుకుని ఉంది.

బాబు కుప్పం నుంచి గెలిచే ముఖ్యమంత్రిగా మూడు సార్లు అయ్యారు. ఇపుడు నాలుగవ సారి గెలిచి సీఎం పదవిని అధిష్టించబోతున్నారు. అలా తమ ఎమ్మెల్యే తాము ఓటు వేసిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు అంటే ఎవరు ఓటేయకుండా ఉంటారు. పైగా బాబు అంటే ప్రేమతోనే అనేక ఎన్నికల్లో గెలిపించిన జనాలు ఒక్కసారి లోకల్ బాడీ ఎన్నికల తరువాత దూరం అవుతారని అనుకోవడమూ తప్పే అవుతుంది. ఏది ఏమైనా కుప్పంలో బాబు గెలుపుతో మరోసారి ఆయన తనదే కుప్పం అని చాటి చెప్పారు.

ఎవరు దాని మీద కన్నేసినా అసలు కుదరదు అంతే అని ఒక సవాల్ కూడా విసిరారు అన్న మాట. సో కుప్పం నుంచి గెలిచిన బాబు మళ్లీ ఏపీ సీఎం అవుతున్నారు. ఈ అయిదేళ్లలో ఆయనకు లక్ కలిస్తే మరిన్ని అందలాలూ ఎక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా బాబు రాజకీయ చాణక్యుడే కాదు రాజకీయంగా దశమంతుడు కూడా అని అంటున్నారు.