ఇంత అర్జెంటుగా చంద్రబాబు అక్కడకు ఎందుకు?
కాగా సీఎం చంద్రబాబు జూన్ 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. వరుసగా 8వ సారి కుప్పం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు
By: Tupaki Desk | 21 Jun 2024 6:47 AM GMTమళ్లీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన శపథాన్ని నెరవేర్చుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో అడుగుపెట్టిన ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
కాగా సీఎం చంద్రబాబు జూన్ 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. వరుసగా 8వ సారి కుప్పం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో అక్కడ పర్యటించనుండటం ఆసక్తి రేపుతుంది. గతంలో ఎప్పుడూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజులకే కుప్పంలో పర్యటించలేదు. కానీ ఈసారి చాలా తొందరగా కుప్పంలో పర్యటించాలని నిర్ణయించుకోవడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
వాస్తవానికి కొత్తగా మంత్రులుగా నియమితులయినవారిలో ఇంకా కొందరు పదవీ బాధ్యతలను చేపట్టాల్సి ఉంది. మరోవైపు కీలకమైన ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఇంకా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎస్పీలను బదిలీ చేయాల్సి ఉంది. అలాగే పలువురిని సలహాదారులుగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.
అన్నిటికంటే ముఖ్యంగా జూలై 1 నాటికి చంద్రబాబు ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు కావాలి. ప్రజలకు పింఛన్ల చెల్లింపు, ఉద్యోగులకు జీతాలు, రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ నిర్వహణకు ఈ మొత్తం అవసరం. ఈ నేపథ్యంలో అధికారులు ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడంపై దృష్టి సారించారు.
ఇన్ని కీలకమైన పనులున్నప్పటికీ చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లనుండటం హాట్ టాపిక్ గా మారింది. కుప్పంలో చంద్రబాబు 1989 నుంచి వరుసగా గెలుపొందుతున్నారు. అయితే ఈసారి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయకుండా చేయడానికి పెద్ద ప్రయత్నాలే జరిగాయి.
ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ టూగా చెలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబును ఓడించడానికి పెద్ద మంత్రాంగమే రచించారు. గతంలో కుప్పంలో నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ,మండల పరిషత్, జిల్లా పరిషత్, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో 90 శాతాలను వైసీపీ కొల్లగొట్టింది. ఇదే క్రమంలో కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామని వైసీపీ శపథం చేసింది.
అయితే కుప్పం ప్రజలు చంద్రబాబు వెంటే నడిచారు. దీంతో ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి ఆయన అక్కడికి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్న ఆయన తన నియోజకవర్గానికి పలు అభివృద్ధి వరాలను ప్రకటిస్తారని చెబుతున్నారు.
అలాగే ఎన్నికల ముందు కుప్పం నియోజకవర్గంలో వైసీపీ దాడుల్లో బాధితులయినవారిని పరామర్శిస్తారని తెలుస్తోంది. అదేవిధంగా కుప్పం టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. పలువురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి చిత్తూరు జైల్లో పెట్టారు. ఇప్పుడు వారు బెయిల్ పై ఉన్నారు. వారిని కూడా చంద్రబాబు కలుస్తారని సమాచారం. పలువురిని నామినేటెడ్ పదవుల్లో నియమిస్తారని తెలుస్తోంది. అలాగే కుప్పం నియోజకవర్గమంతా రెండు రోజులపాటు పర్యటించి ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తారు.
వాస్తవానికి తాను ఎన్నికల్లో గెలవగానే కుప్పం వస్తానని పార్టీ నేతలు, ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. మొదటి వారంలోనే కుప్పంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్తున్నారని తెలుస్తోంది.