Begin typing your search above and press return to search.

జైలు నుంచే నడిపిస్తున్న బాబు!

అవును.. బాబు జైల్లో ఉండే బయట పరిస్థితులు చక్కదిద్దుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   19 Oct 2023 8:46 AM GMT
జైలు నుంచే నడిపిస్తున్న బాబు!
X

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ మీద జైల్లో ఉన్నారు. బాబు జైల్లో ఉన్నారు.. టీడీపీ పనైపోయింది, ఇంకేముందీ? అనే ప్రశ్నలు వినిపించాయి. బాబు జైలుకు వెళ్లి నెల రోజులు అయిపోయింది. కానీ ఇప్పటికీ ప్రజా కార్యక్రమాలతో టీడీపీ యాక్టివ్ గానే దూసుకెళ్తోంది. బాబు నిరసనగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీ ప్రజల్లోని ఉంటుంది. దీనికి కారణం ఎవరు? అంటే కచ్చితంగా వినిపించే సమాధానం చంద్రబాబు అని. అవును.. బాబు జైల్లో ఉండే బయట పరిస్థితులు చక్కదిద్దుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాబు జైలుకు వెళ్లడంతో ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రంగంలోకి దిగారు. రాజమండ్రిలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు బాబు తనయుడు నారా లోకేష్ అటు సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం కోసం ఢిల్లీ వెళ్లి వస్తూ.. ఇటు ఏపీలోనూ పార్టీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు.

అయితే వీళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ కార్యక్రమం చేపట్టినా దాని వెనుక చంద్రబాబు ఉన్నారనేది నిజమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి క్లిష్ట పరిస్థితిని సమర్థంగా ఎదుర్కునేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ములాఖత్ లో భాగంగా బాబును కలుస్తున్న కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు బయటకొచ్చి ఆయన ప్రణాళికలకు అమలు చేస్తున్నారనే చెప్పాలి.

తాజాగా ప్రజల్లోకి వెళ్లేందుకు నారా భువనేశ్వరి, లోకేష్ నిర్ణయాలు తీసుకున్నారు. బాబు అరెస్టు, జైలుకు వెళ్లడం జీర్ణించుకోలేక మరణించిన వాళ్ల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. 'నిజం గెలవాలి' అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు భువనేశ్వరి సిద్ధమయ్యారు. జోన్ల వారీగా నిర్వహించే సభల్లో ఆమె పాల్గొననున్నారు. మరోవైపు అరెస్టు కాకముందు చంద్రబాబు చేపట్టిన 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమాన్ని ఇప్పుడు లోకేష్ కొనసాగించనున్నారు.

నవంబర్ నుంచి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. జైల్లో చంద్రబాబును భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి కలిసి వచ్చిన తర్వాత పార్టీ ఈ కార్యక్రమాలను ప్రకటించింది. బాబు దిశానిర్దేశం మేరకే ఈ కార్యక్రమాలు చేపట్టాలని అంతా కలిసి నిర్ణయించుకున్నారని తెలిసింది.