Begin typing your search above and press return to search.

చంద్రబాబు అడిగింది డీజీపీ ఇస్తారా

కాగా చంద్రబాబు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి సంచలన లేఖ రాశారు. తనపై ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదై ఉన్నాయో వాటి వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు.

By:  Tupaki Desk   |   5 March 2024 7:03 AM GMT
చంద్రబాబు అడిగింది డీజీపీ ఇస్తారా
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆయన తమ కూటమికే అధికారం దక్కుతుందని భావిస్తున్నారు. 'రా కదిలి రా', 'శంఖారావం', 'జెండా' పేరుతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేశ్‌ భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.

కాగా చంద్రబాబు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి సంచలన లేఖ రాశారు. తనపై ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదై ఉన్నాయో వాటి వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ రానుందని.. ఈ నేపథ్యంలో తనపై ఎన్ని కేసులు పెట్టారో తనకే తెలియదని.. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదు చేసిన కేసుల వివరాలను ఇవ్వాలన్నారు.

ఎన్నికల నామినేషన్‌ లో తనపై ఎన్ని కేసులు నమోదై ఉన్నాయో తాను వివరాలు పొందుపరచాల్సి ఉంటుందని.. అందుకని తనపై నమోదై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతున్నానని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. డీజీపీకే కాకుండా అన్ని జిల్లాల ఎస్పీలు, ఏసీబీ, సీఐడీ విభాగాలకు కూడా చంద్రబాబు లేఖలు రాశారు.

2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై వైసీపీ ప్రభుత్వం పలు అక్రమ కేసులు పెట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలపాలని కోరుతున్నానన్నారు. తాను ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి సమాచారం పొందడం ఆచరణ సాధ్యం కాదని తెలిపారు. అందుకే మీ కార్యాలయాల ద్వారా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా అని డీజీపీ, ఎస్పీలు, ఏసీబీ, సీఐడీలకు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ ఏ క్షణాన అయినా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ వివరాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. ఏ వ్యక్తికీ తనపై పోలీసులు, దర్యాప్తు సంస్ధలన్నీ నమోదు చేసిన అన్ని కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదని గుర్తు చేశారు. కాబట్టి అధీకృత సంస్థగా మిమ్మల్ని ఈ వివరాలు అడుగుతున్నానని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి ఆలస్యం జరిగినా ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలు నిర్వర్తించాలంటే 2019 నుంచి తనపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.

కాగా చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖ హాట్‌ టాపిక్‌ గా మారింది. ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి 13న వెలువడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కోరినట్టు ఆయనపై నమోదు చేసిన కేసుల వివరాలను డీజీపీ ఇస్తారా, లేదా అనేది హాట్‌ టాపిక్‌ గా మారింది. డీజీపీ స్పందించకుంటే చంద్రబాబు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని అంటున్నారు.