చంద్రబాబు ప్రయోగం చేస్తున్నారా ?
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డిని చంద్రబాబు కడప లోక్ సభ కు పోటీచేయించాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
By: Tupaki Desk | 9 Sep 2023 5:11 AM GMTరాబోయే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబునాయుడు ప్రయోగం చేయబోతున్నారని అర్ధమవుతోంది. అలాంటి నియోజకవర్గాల్లో కడప అసెంబ్లీ సీటు కూడా ఒకటి. ఎలాగంటే కడప అసెంబ్లీ ఇన్చార్జిగా మాధవీరెడ్డిని నియమించారు. మాధవీరెడ్డి ఎవరంటే పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి భార్య. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డిని చంద్రబాబు కడప లోక్ సభ కు పోటీచేయించాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
తాను పార్లమెంటుకు పోటీచేస్తానని అందుకని తన భార్యను కడప అసెంబ్లీకి పోటీచేసే అవకాశం ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరారు. దాంతో చంద్రబాబు కన్వీన్స్ అయి మాధవిని ఇపుడు ఇన్చార్జిగా నియమించారు.
ఇపుడు ఇన్చార్జిగా నియమించటం అంటే రాబోయే ఎన్నికల్లో కడప అభ్యర్ధి అని అనుకోవచ్చు. రాజకీయంగా వీళ్ళది ప్రముఖ కుటుంబమే కానీ ఈమధ్య కాలంలో గెలిచిందేమీ లేదు. కడప అసెంబ్లీలో టీడీపీ చివరిసారిగా గెలిచింది 1999 ఎన్నికల్లో మాత్రమే.
నిజానికి కడప అసెంబ్లీ అయినా పార్లమెంటు ఎన్నికల్లో అయినా టీడీపీ బ్యాక్ గ్రౌండ్ అంత బాగా ఏమీలేదు. ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాన్ని రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలుచుకోవాల్సిందే అని చంద్రబాబు బాగా పట్టుదలగా ఉన్నారు.
అందుకనే రెండుమూడుసార్లు సర్వేలు చేయించుకున్నారు. టికెట్ కోసం టీడీపీ కౌన్సిలర్ ఉమ కూడా బాగా పట్టుదలగా ఉన్నారు. అయితే అన్నీ విషయాలు పరిశీలించిన తర్వాత చంద్రబాబు మాత్రం మాధవిని ఇన్చార్జిగా నియమించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా ముస్లిం అభ్యర్ధులనే రంగంలోకి దింపుతోంది. గడచిన రెండు ఎన్నికల్లో అంజాద్ భాష వైసీపీ తరపున గెలిచారు. నియోజకవర్గంలో ముస్లింలు, బలిజలు, రెడ్డి సామాజికవర్గం ఎక్కువుగా ఉంది. ఈ కారణంతోనే ముస్లిం అభ్యర్ధిని రంగంలోకి దింపు వైసీపీ గెలుస్తోంది. అందుకనే టీడీపీ తరపున రెడ్డి అభ్యర్ధిని రంగంలోకి దింపితే నాన్ ముస్లిం సామాజికవర్గం ఓట్లను వేయించుకోవాలనే వ్యూహంతో చంద్రబాబు ప్రయోగం చేస్తున్నారు. మరి ఈ ప్రయోగం చివరకు ఏమవుతుందో చూడాలి.