జగన్ కి బాబు ఫోన్?...మ్యాటరేంటి అంటే!
అసెంబ్లీలో తప్ప బయట ఎక్కడా కలవకుండా ముఖాముఖాలు చూసుకోకుండా ఉండే రాజకీయం ఏపీకి మాత్రమే సొంతం.
By: Tupaki Desk | 11 Jun 2024 2:57 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఫోన్ చేసారు. ఈ న్యూస్ ఒక విధంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉప్పు నిప్పు మాదిరిగా ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి. అసెంబ్లీలో తప్ప బయట ఎక్కడా కలవకుండా ముఖాముఖాలు చూసుకోకుండా ఉండే రాజకీయం ఏపీకి మాత్రమే సొంతం.
ఇదిలా ఉంటే చంద్రబాబు టీడీపీ కూటమిని నాయకత్వం వహించి అద్భుతమైన మెజారిటీని సాధించి అధికారంలోకి వచ్చారు. బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆ కార్యక్రమానికి హాజరు కావాలని జగన్ ని కోరడం కోసం ఫోన్ కలిపారు.
అయితే బాబు ఫోన్ కి జగన్ అందుబాటులోకి రాలేదని అంటున్నారు. ఒక విధంగా చూస్తే వైసీపీ బాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి జగన్ ఎందుకు అందుబాటులోకి రాలేదో వివరాలు తెలియడం లేదు.
ఇదిలా ఉంటే 2019లో జగన్ సీఎం గా ప్రమాణం చేసిన సందర్భంలో బాబుకు జగన్ ఫోన్ చేశారు. తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని జగన్ బాబుని ఆనాడు కోరినట్లుగా ప్రచారంలో ఉంది. అయితే బాబు ఆనాడు హాజరు కాలేదు. ఇపుడు జగన్ కూడా హాజరయ్యే అవకాశాలు అసలు ఏమాత్రం లేవు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఇద్దరూ సీఎంలుగా చేసిన వారు. ఏపీని అగ్రభాగాన నిలబెట్టాలని ఒకే త్రాటి మీదకు వచ్చి కృషి చేయాల్సిన వేళ ఇలాంటివి మంచివేనా అన్న చర్చ అయితే సాగుతోంది.
అయితే రాజకీయ పార్టీల స్టాండ్స్ వారికి ఉంటాయి. వాటిని ఎవరూ తప్పుపట్టాల్సింది లేదు. కానీ ఏ రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అయినా ప్రజలకు మేలు చేయడం రాష్ట్రం కోసం దాని అభివృద్ధి కోసం పాటుపడడం, మరి ఆ విధంగా చూస్తే ఏపీలోని రాజకీయ పక్షాలు అంతా ఒక్కటి కావాల్సి ఉంది. ప్రజల కోసం విభజనతో అన్ని విధాలుగా కునారిల్లిన ఏపీ కోసం పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అంతా చేతులు కలపాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ విషయంలో రానున్న రోజులలో ఏపీ పెద్దగా చంద్రబాబు పూర్తి స్థాయిలో కృషి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.