Begin typing your search above and press return to search.

చంద్రబాబు మార్క్ ఇంకా ఏపీలో కనపడలేదా ?

ఇపుడు నాలుగవ సారి ఏపీకి సీఎం అయిన చంద్రబాబు తన మార్క్ వేస్తున్నారా అన్నదే చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   22 Aug 2024 11:30 AM GMT
చంద్రబాబు మార్క్ ఇంకా ఏపీలో కనపడలేదా ?
X

చంద్రబాబు అంటే విజనరీ అని పేరు. బాబు అంటే అడ్మినిస్ట్రేటర్ అని కూడా పేరు. ఉమ్మడి ఏపీ సీఎం గా తొమ్మిదేళ్ళ పాటు పాలించిన చంద్రబాబు తనదైన మార్క్ పాలనలో చూపించారు. ఇక 2014 నుంచి 2019 దాకా విభజన ఏపీలో కూడా ఆయన తన పద్ధతిలో పాలన సాగించారు. ఇపుడు నాలుగవ సారి ఏపీకి సీఎం అయిన చంద్రబాబు తన మార్క్ వేస్తున్నారా అన్నదే చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో చంద్రబాబు వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది అనుకున్న వారికి ఇపుడు కొంత నిరాశ అయితే తప్పడం లేదు. ఇంకా ఆ దిశగా సంకేతాలు ఏవీ లేకపోవడమే దానికి కారణం. దీంతో ప్రజలు బాబు మార్క్ ఏదీ అని చర్చించుకుంటున్నారు. ఇక ప్రభుత్వం బయటకు ఏమీ చెప్పకపోయినా పాలన సాగుతున్న తీరు అడపా తడపా కూటమి మంత్రులు నేతలు ఇస్తున్న ప్రకటనలు బట్టి చూస్తే ఈ ఏడాదికి సంక్షేమ పథకాలు అన్నవి లేవు అన్న క్లారిటీ వస్తోంది.

బాబు వస్తే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది అని భావించినా ఆ రంగం కూడా ఏపీలో ఏమీ పెద్దగా పెరగలేదు. దాంతో పాటు నగదు బదిలీ పధకాలు ఏవీ జనాలకు చేరలేదు. మరో వైపు చూస్తే అభివృద్ధి అన్నది కూడా పట్టాలెక్కలేదు. సగటు జనం తీరు ఎలా ఉంది అంటే అభివృద్ధి కావాలా డబ్బులు కావాలా అంటే డబ్బులే కావాలని అంటున్నారు.

జగన్ డబ్బులు ఇచ్చినా ఓట్లు ఆయనకు రాలేదు, ఘోరంగా అధికారం నుంచి దిగిపోయారు. ఆ విషయమే కూటమిలో చర్చగా ఉంది. అలాగని పధకాలను ఆపేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది అని అంటున్నారు. ఇది సాదా జనం చెప్పే మాట కాదు మేధావులు అంటున్న మాట.

మరో వైపు చూస్తే జగన్ ఓడినా 40 శాతం ఓట్లు వచ్చాయీ అంటే అవి నగదు బదిలీ పధకాల వల్లనే అని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ చేసిన తప్పు ఏమిటి అంటే అభివృద్ధి ఏమీ ఏపీలో చేయకుండా కేవలం నగదు బదిలీ పథకాలు నమ్ముకోవడం. దాని వల్లనే ఆయన నిండా మునిగారు అని అంటున్నారు.

ఇక జగన్ ఎమ్మెల్యేల మీద కంట్రోల్ పెట్టుకోలేకపోయారు. అదే సమయంలో వారితో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేక పోయారు. ప్రజల నుంచి గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఏ మాత్రం అధికారం లేకుండా చేసి వాలంటీర్లను తెచ్చి నెత్తిన పెట్టారు. దాంతో జగనే దారుణంగా ఓటమి చూసారు. ఈ మొత్తం వ్యవహారంలో క్యాడర్ కూడా ఫుల్ సైలెంట్ కావడమే వైసీపీకి కొట్టిన శాపం అని కూడా అంటున్నారు. క్యాడర్ కి ఏమీ చేయకపోవడమే జగన్ చేసిన మరో తప్పు అని అంటున్నారు.

అదే చంద్రబాబు విషయం తీసుకున్నా క్యాడర్ కి ఏమీ ఇప్పటిదాకా అయితే చేయలేదు అని అంటున్నారు. ఓట్లేసి భారీ మెజారిటీతో బంపర్ సీట్లు ఇచ్చిన ప్రజలకు కూడా బాబు ఏమీ చేయలేదు. అన్నా క్యాంటీన్లు అన్నది పెద్ద సంక్షేమ పథకం ఏమీ కాదు. ప్రైవేట్ గా కూడా దాతలు చాలా మంది భోజనం పెడుతున్నారు. అలా నిత్యాన్నదానం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఇదంతా ఎవరి ఆర్థిక స్తోమత ఎంత అన్న దానిని బట్టి ఉంటుంది.

ఈ రోజులలో చూస్తే జనాలు చాలా తెలివి అయిన వారుగా చెప్పాలి. వారు ఏ ఒక్కటీ మిస్ కారు. అన్నింటినీ గమనిస్తూనే ఉంటారు. బాబు పధకాలను ఎపుడు ఇస్తారు అన్నది కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే మద్యం ధరలు ఎపుడు తగ్గిస్తారు అని కూడా ఆలోచిస్తున్నారు. హామీ మేరకు మద్యం ధరలను తగ్గించి నాణ్యమైన మందును అందించవచ్చు. కానీ అలా ఒక్కసారిగా మద్యం ధరలను తగ్గిస్తే ఆదాయం తగ్గి రాష్ట్ర ఖజానా వెలవెలబోతోంది అని అధికారులు ప్రభుత్వానికి చెబుతున్నారు.

ఇక గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ ఖాళీగా ఊరుకోరు కదా. అందుకే వారు పని మొదలెట్టేశారు అని అంటున్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారింది అని అంటున్నారు. ఈ మేరకు నివేదికలు కూడా కూటమి సర్కార్ పెద్దల వద్దకు వెళ్లాయని అంటున్నారు.

జగన్ కి ఎమ్మెల్యేల మీద కంట్రోల్ ఎలా లేదో బాబుకు కూడా అదే విధంగా ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేకుండా పోయింది అని కూడా అంటున్నారు. ఎందుకు అంటే ఉద్యోగులు అధికారుల బదిలీ విషయంలోనే ఎమ్మెల్యేలు చాలా ముందుకు పోయారు. డబ్బులు పెద్ద ఎత్తున చేతులు మారాయి అన్న ప్రచారంలో వాస్తవాలు ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.

మరో వైపు చూస్తే ప్రపంచం అంతా ఆర్ధిక మాంద్యం ఉంది.ఈ నేపధ్యంలో హెచ్ సీ ఎల్ ఏకంగా ఏపీలో 15000 ఉద్యోగాలు సృష్టించి ఇవ్వగలదా అన్నది కూడా మరో చర్చగా ఉంది. దీని మీద కూటమి పెద్దలు చెబుతున్నది కూడా ఆలోచించాల్సి ఉంది అని అంటున్నారు. ఒక వైపు చూస్తే అమెరికాలో పెద్ద ఎత్తున జాబ్ మార్కెట్ అయితే పడిపోయింది అని అంటున్నారు. కానీ హెచ్ సీ ఎల్ మాత్రం సాప్ లో ఏకంగా 15 వేల ఉద్యోగాలు ఎలా ఇవ్వగలదు అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.

ఇక చంద్రబాబు అసలు సిసలు ప్రయారిటీ అయిన అమరావతి రాజధాని విషయంలో ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఇస్తుంది అని తెగ ఊదరగొడుతున్నారు. ఆ పదిహేను వేల కోట్లు అమరావతి రాజధానికి ఏ మేరకు సరిపోతాయని కూడా ప్రశ్నలు ఉన్నాయి. లక్ష కోట్లు ఉంటేనే కానీ అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన అన్నది జరగదు అని అంటున్నారు.

ఇక ఏపీలో మరో భారీ ప్రాజెక్టు పోలవరం విషయం చూస్తే కేంద్రం ఏమి ఇస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. పదేళ్లలో కేవలం 15 వేల కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రం ఇపుడు దానికి నాలుగు రెట్లు ఒకేసారి ఇచ్చి పోలవరం పూర్తి చేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. మొత్తం మీద చూసుకుంటే అటు డెవలప్మెంట్ కానీ ఉపాధి రంగం కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ ఏవీ కూడా ఇంకా ఒక అస్పష్ట రూపంలోనే ఉన్నాయి. చంద్రబాబు అయితే సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి అవుట్ పుట్ ఏంటి అంటే ఖజానా ఖాళీ అని జనాలకు చెప్పడమే. ఆ మాటలు నమ్మి జనాలు ఊరుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.