Begin typing your search above and press return to search.

బాబు మార్కులు ముగ్గురు మంత్రులకే !

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇది నాలుగోసారి సీఎం గా పనిచేస్తున్న అనుభవం.

By:  Tupaki Desk   |   17 July 2024 7:30 AM GMT
బాబు మార్కులు ముగ్గురు మంత్రులకే !
X

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇది నాలుగోసారి సీఎం గా పనిచేస్తున్న అనుభవం. ఆయన గతంలో సీఎం అయినపుడు కూడా మంత్రుల పనితీరు మీద తరచూ మధింపు చేసేవారు. మంత్రులకు ర్యాంకులు కూడా ఇచ్చేవారు. ఎప్పటికప్పుడు పని తీరు మెరుగుపరచుకోమని తాను అంతా గమనిస్తూంటాను అని బాబు చెబుతూ వచ్చారు. ఈ ర్యాంకులు ఇవ్వడం వెనక ఉద్దేశ్యం కూడా అదే.

ఇక తొలి నెల కాబట్టి అపుడే ర్యాంకులు ఇవ్వడం బాగోదని అంటూనే ముగ్గురు మంత్రుల పనితీరు బాగుందని బాబు మార్కులు వేశారు. ఆ విధంగా బాబు నుంచి మార్కులు కొట్టేసిన మంత్రులు ఎవరు అంటే నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు గా చెబుతున్నారు.

నారా లోకేష్ మంత్రి అయిన దగ్గర నుంచి తన శాఖలలో ఎప్పటికప్పుడు రివ్యూస్ నిర్వహిస్తూ వస్తున్నారు. అంతే కాదు ఆయన విధానపరమైన నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారు. ఫైల్స్ క్లియర్ చేస్తూ జోరు పెంచుతున్నారు. అదే సమయంలో ప్రజలను కలుస్తూ వారి సమస్య్ల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అలాగే పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నారు.

ఇలా మొదటి నెలలోనే బాబు ఆశించిన దాని కన్నా ఎక్కువగానే లోకేష్ కష్టపడ్డారని అంటున్నారు. అదే విధంగా నాదెండ్ల మనోహర్ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శాఖాపరంగా మార్పులు తెచ్చారు. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపధ్యంలో బియ్యం పప్పులను రైతు బజారులలో అమ్మకానికి తక్కువ రేటుకు పెట్టారు. రేషన్ దుకాణాలకు వెళ్ళి తనిఖీలు చేస్తూ అవినీతి అక్రమాలకు అడ్డు కట్ట వేస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలలో చురుకు ప్రదర్శిస్తున్నారు. ఆయన తొలిసారిగా మంత్రి అయినా తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు.

మరో మంత్రి నిమ్మల రామానాయుడు జల వనరుల శాఖలో సమీక్షలు చేస్తూ పట్టుని పెంచుకుంటున్నారు. పట్టిసీమకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని హైలెట్ గా నిర్వహించారు. దాని వల్ల ప్రభుత్వానికి ఎంతో పేరు వచ్చింది. పోలవరం గురించి జనాలకు రైతులకు అవగాహన అయ్యేలా చెబుతున్నారు. గత ప్రభుత్వం తప్పిదాలను వివరిస్తున్నారు. అలాగే మీడియాకు, ప్రజలకు పార్టీ జనాలకు అందుబాటులో ఉంటున్నారు. ఇలా ఈ ముగ్గురూ మార్కులు బాబు వద్ద కొట్టేశారు అని అంటున్నారు. మిగిలిన వారు శాఖాపరంగా అవగాహన పెంచుకుంటున్నారని వారు బాగా మెరుగుపడాలని బాబు సూచిస్తున్నారు.