Begin typing your search above and press return to search.

షిండేతో బాబు భేటీ...ఆసక్తికరమైన చర్చ!

అయితే అనూహ్యంగా చంద్రబాబు మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండేతో భేటీ అయ్యారు.

By:  Tupaki Desk   |   15 July 2024 2:12 AM GMT
షిండేతో బాబు భేటీ...ఆసక్తికరమైన చర్చ!
X

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్ నాథ్ షిండేతో ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది. ముంబైకి చంద్రబాబు శనివారం వెళ్లారు. అంబానీ వారి ఇంట వివాహ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఆయన తిరిగి ఆదివారం ఏపీకి రావాల్సి ఉంది.

అయితే అనూహ్యంగా చంద్రబాబు మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండేతో భేటీ అయ్యారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఏక్ నాథ్ షిండే సీఎం అయ్యాక బాబు ఆయనను కలసిన దాఖలాలు లేవు. ఇటీవల ఎన్డీయే సమావేశం ఢిల్లీలో జరిగినపుడు అక్కడ హాజరైనప్పుడు కలసి ఉండవచ్చు.

కానీ ముంబై లోని ఆయన నివాసానికి బాబు వెళ్ళి భేటీ కావడం మాత్రం ఇపుడు చర్చకు తావిస్తోంది. ఇద్దరూ ఎన్డీయే మిత్రులే. బాబు టీడీపీకి 16 ఎంపీలు ఉంటే ఏక్ నాథ్ షిండే శివసేనకు తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. ఈ మద్దతు బీజేపీకి ఇపుడు అత్యంత కీలకంగా మారింది.

మరో వైపు చూస్తే శనివారం 13 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అవి ఎన్డీయేకు వ్యతిరేకంగా వచ్చాయి. మరో వైపు ఇండియా కూటమి పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న వేళ బాబు షిండేతో చంద్రబాబు భేటీ కావడం అంటే ఎందుకు ఏమిటి మ్యాటర్ అన్నది అందరిలోనూ ప్రశ్నలుగా వస్తున్నాయి.

అయితే ఈ భేటీలో ఏపీ మహారాష్ట్ర పరస్పరం సహకారాన్ని అంది పుచ్చుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. అలాగే చంద్రబాబుని అపారమైన రాజకీయ అనుభవం కలిగిన మేధావిగా కూడా షిండే చేసిన ట్వీట్ లో అభివర్ణించారు.

ఇక రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు గల అవకాశాల మీద చర్చలు జరిగాయని అంటున్నారు. ఈ భేటీ ఏకంగా నలభై నిముషాల పాటు సాగింది. ఇద్దరు రాజకీయ నేతలు భేటీ అయితే అందులో రాజకీయాలు లేకుండా ఉంటాయా అన్నది వట్టి ప్రశ్న. కచ్చితంగా ఉంటాయి.

ఎన్డీయే ప్రభుత్వం గురించి తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చలు జరిగే ఉంటాయని అంటున్నారు. షిండే బీజేపీకి నమ్మదగిన మిత్రుడిగా ఉన్నారు. శివసేనలో మాస్ లీడర్ గా ఎదిగి బాలా సాహెబ్ బాల్ ఠాక్రే కి నచ్చిన నేతగా కూడా ఉన్నారు. ఆయన అండతోనే మహారాష్ట్రలో శివసేన అనేక విజయాలు సాధించింది. ఇప్పుడు శివసేన చీలింది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు గడచిన ఎంపీ ఎన్నికల్లో ఏడు సీట్లు మాత్రమే దక్కాయి.

ఆ విధంగా శివసేన మీద ఆధిక్యత సాధించిన షిండే మహారాష్ట్ర రాజకీయాలలో బలమైన నేతగా ఉన్నారు. ఎన్డీయేలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. ఈ ఇద్దరూ ఇపుడు భేటీ కావడం అంటే మ్యాటర్ ఏమిటి అన్నది మాత్రం చర్చగానే ఉంది. అయితే రెండు రాష్ట్రల ప్రయోజనాల కోసమే అని అంటున్నారు. కానీ ఎన్డీయేలో కీలకమైన ఇద్దరు మిత్రులు బీజేపీ పరోక్షంలో భేటీ కావడం వర్తమాన రాజకీయాలలో చూస్తే ఒకింత సంచలనమే అని అంటున్నారు.