Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ విషయంపై మోడీని కలవనున్న బాబు !?

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Aug 2024 3:54 AM GMT
స్టీల్ ప్లాంట్ విషయంపై మోడీని కలవనున్న బాబు !?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా మంగళగిరిలో తనను కలసిన విశాఖ ఉక్కు కార్మికులకు బాబు ఈ మేరకు హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఏమీ కాకుండా తాను చూసుకుంటానని అభయం ఇచ్చేశారు. మీ పని మీరు చేయండి, విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు లాభాల బాట పట్టించేందుకు అంకిత భావంతో పనిచేయమని బాబు వారికి సూచించారు.

విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా తాను మిగతాది అంతా చూసుకుంటాను అని బాబు తన మీదనే భారం వేసుకున్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని తాను నేరుగా కలసి అన్ని విషయాలూ వివరిస్తాను అని బాబు చెప్పడం పట్ల ఉక్కు కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. బాబు సీఎం అయిన తరువాత తొలిసారి మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఆయనను కలసిన ఉక్కు పరిరక్షణ పోరట కమిటీ నాయకులు బాబుని కలసి ఉక్కు సమస్యలను ఏకరువు పెట్టారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి అర్జంటుగా అయిదు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని వారు వివరించారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం ప్రకటించిన నాటి నుంచి స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన అయిదు లక్షల మంది కార్మికులు నిద్ర లేని రాత్రులే గడుపుతున్నారని వారు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయాలని కూడా కోరారు.

అయితే అన్నీ విన్న చంద్రబాబు తాను ఈ విషయంలో పూర్తి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కార్మికులు అంతా పరిశ్రమను లాభాల బాటలో నడిపేందుకు దృష్టి సారించాలని కోరారు. ఉక్కు యాజమాన్యంతో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడుతానని బాబు వారికి తెలిపారు.

విశాఖ మొత్తం టీడీపీ కూటమికి ఇటీవల ఎన్నికల్లో అండగా నిలబడింది. అలాగే ఉత్తరాంధ్ర మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి ఉత్తరాంధ్ర కు కేంద్ర బిందువుగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే దాని ప్రభావం రాజకీయంగా టీడీపీ మీద పడుతుందని అంటున్నారు. చంద్రబాబు కూడా ఏపీకి గర్వకారణం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలని చూస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు ఈ సమస్యను గత నాలుగేళ్ళుగా ఎవరూ తీసుకుని వెళ్ళ్లేదు. గత వైసీపీ ప్రభుత్వం అయితే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఊరుకుంది కానీ దీని మీద ప్రధానితో మాట్లాడలేదని అసంతృప్తి అయితే కార్మిక లోకంలో ఉంది. ప్రధాని మోడీని కన్వీన్స్ చేస్తేనే తప్ప ఈ ప్రైవేటీకరణ ఆగదు అని కార్మిక సంఘాలు అంటున్నాయి.

ఇపుడు చంద్రబాబు కూడా ఇదే విషయం మీద తాను ప్రధానిని కలుస్తామని అంటున్నారు. దాంతో విశాఖ ఉక్కు ప్రైవేట్ వేటు నుంచి తప్పించుకున్నట్లేనా అంటే బాబు హామీ ఇచ్చారు కాబట్టి ధీమాగా ఉండవచ్చు అని అంటున్నారు.