Begin typing your search above and press return to search.

మోడీతో చంద్రబాబు భేటీ..ఆ విషయాలపై చర్చ!

ఇటు ఏపీలో, అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 July 2024 9:40 AM GMT
మోడీతో చంద్రబాబు భేటీ..ఆ విషయాలపై చర్చ!
X
ఇటు ఏపీలో, అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అదీగాక కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడడంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పాత్ర వహించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ప్రధాని మోడీ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో, ఏపీకి మంచి రోజులు వచ్చాయని, రాష్ట్రానికి నిధులు తేవడంలో చంద్రబాబు సఫలమవుతారని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు.

రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణాలకు నిధులు, పోలవరంతో పాటు పలు అంశాల‌పై ప్ర‌ధానితో చ‌ర్చించారు. అంత‌కుముందు చంద్ర‌బాబు కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో చంద్రబాబు అర‌గంట పాటు ముచ్చ‌టించారు. చంద్రబాబుతోపాటు ఏపీకి చెందిన ఎన్‌డీఏ ఎంపీలు కూడా ఆ భేటీలో ఉన్నారు.

ఆ తర్వాత కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రీ, శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌, అమిత్ షా, మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌, హ‌ర్దీప్ సింగ్ పురీతో భేటీ కానున్నారు. ఇక, కేంద్ర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడుకు రెండు కమిటీల్లో చోటు దక్కింది. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీలో రామ్మోహన్ ఉన్నారు. అదే విధంగా, రాజకీయ వ్యవహారాల కమిటీలో బొగ్గు గనుల శాఖ మంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఇక, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో మోదీ చోటిచ్చారు.

కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. లోక్‌సభ సమావేశాల దృష్ట్యా వీరి గత భేటీ వాయిదా పడింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, లభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలను ప్రధాని దృష్టికి రేవంత్ తీసుకెళ్లనున్నారు.