Begin typing your search above and press return to search.

వరుస సర్ ప్రైజ్ లు ఇస్తున్న చంద్రబాబు

నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   9 Aug 2024 6:41 AM GMT
వరుస సర్ ప్రైజ్ లు ఇస్తున్న చంద్రబాబు
X

నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన్ను అత్యంత దగ్గరగా చూస్తున్న పొలిటికల్ జర్నలిస్టులు సైతం మాట్లాడుకోవటం విశేషం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో వ్యవహరించిన తీరుకు తాజాగా ఆయన వ్యవహారశైలికి మార్పు ఎక్కువగా ఉందంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తారన్న చెడ్డపేరు చంద్రబాబుకు ఎక్కువ.

గతంలోనూ ఆయన విపక్ష నేతగా వ్యవహరించినప్పటికి.. గడిచిన ఐదేళ్లలో ఆయన విపక్షనేతగా ఎదుర్కొన్న సవాళ్లు చాలా ఎక్కువ. తన రాజకీయ జీవితం మొత్తంలో ఎప్పుడూ ఎదుర్కోనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇది చంద్రబాబును చాలానే ప్రభావితం చేసిందంటున్నారు. అందుకే బాబులో మార్పు ఎక్కువగా ఉందంటున్నారు. తన చేతిలో అధికారంలో లేనప్పుడు తన వెంట నడిచిన వారిని గుర్తు పెట్టుకొని మరీ పిలిపించుకోవటం.. వారి అవసరాల గురించి ఆరా తీయటం ఎక్కువగా ఉంది.

అంతేనా.. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు.. ఫోకస్ మొత్తం గమ్యస్థానం.. అక్కడ చేసే పనుల మీద ఫోకస్ ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. తరచూ ఆయన కాన్వాయ్ ఆగటం.. చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడటం.. యోగక్షేమాల గురించి ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. అనూహ్య రీతిలో ఆయన కాన్వాయ్ ఆగుతోంది. నిన్నటికి నిన్న క్రిష్ణా బ్యారేజ్ మీద వెళ్లేటప్పుడు.. అక్కడి జలసిరిని చూసి ఆపి మరీ.. వంతెన మీద కాసేపు గడపటం కనిపిస్తోంది. దానికి ఒక రోజు ముందు.. చేనేత ప్రదర్శనకు వెళ్లిన వేళలో.. తన సతీమణి నారా భువనేశ్వరికి రెండు చీరలు కొనటం లాంటి కొత్త పనుల్ని చేస్తున్నారు. ఇలా తన చేష్టలతో వరుస సర్ ప్రైజులు ఇస్తున్న చంద్రబాబు.. తాజాగా మరో ఆసక్తికర సన్నివేశానికి కారణమయ్యారు.

తాను విపక్షంలో ఉన్నప్పుడు తనను ఫాలో అయ్యే ఇద్దరు అభిమానుల్ని గుర్తు పెట్టుకొని మరీ తన వద్దకు పిలిపించుకున్న చంద్రబాబు.. వారితో మాట్లాడటం.. వారి గురించి తెలుసుకోవటంతో ఆ ఇద్దరు అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు దెందులూరుకు చెందిన దుర్గాదేవి.. మరొకరు వినుకొండకు చెందిన శివరాజు యాదవ్. వీరిద్దరు తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు. విపక్షంలో ఉన్న ఐదేళ్లలో.. ఎప్పుడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా అక్కడకు ఈ ఇద్దరు వచ్చేవారు. దుర్గాదేవి అయితే.. చంద్రబాబు కాన్వాయ్ తో పాటు స్కూటీ మీద ఫాలో అవుతూ ఉత్సాహంగా వెంట ఉండేవారు. శివరాజు అయితే.. చంద్రబాబు పర్యటనకు కాస్త ముందే అక్కడకు వెళ్లటం.. హాజరుకావటం లాంటివి చేసేవారు.

చంద్రబాబు అరెస్టు అయి రాజమండ్రి జైల్లో ఉన్న వేళలోనూ కొన్ని రోజుల పాటు వారిద్దరు అక్కడే ఉండటం గమనార్హం. వీరిని గుర్తు పెట్టుకొని మరీ.. వారిద్దరిని చంద్రబాబు తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా పిలిపించుకొని మాట్లాడారు. వారి కుటుంబాలు.. కుటుంబ సభ్యులు.. వారి నేపథ్యాల గురించి తెలుసుకోవటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలాంటి తీరు చంద్రబాబులో గతంలో ఉండేది కాదని.. ఇటీవల కాలంలోఆయన ఈ తరహా సర్ ప్రైజ్ లు ఇస్తున్నట్లు చెబుతున్నారు.