Begin typing your search above and press return to search.

'సిద్ధం' స‌భ‌ల‌కు పోటీ.. 5 నుంచి చంద్ర‌బాబు శంఖారావం.. ఇదే టార్గెట్‌

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 5 నుంచి ఎన్నిక‌ల శంఖం పూరించ‌నున్నారు. వైసీపీ నిర్వ‌హిస్తున్న సిద్ధం స‌భ‌ల‌కు దీటుగా ఆయ‌న మ‌రిన్ని స‌భ‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 1:09 PM GMT
సిద్ధం స‌భ‌ల‌కు పోటీ.. 5 నుంచి చంద్ర‌బాబు శంఖారావం.. ఇదే టార్గెట్‌
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 5 నుంచి ఎన్నిక‌ల శంఖం పూరించ‌నున్నారు. వైసీపీ నిర్వ‌హిస్తున్న సిద్ధం స‌భ‌ల‌కు దీటుగా ఆయ‌న మ‌రిన్ని స‌భ‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో విశాఖ‌లో ఇప్ప‌టి కే స‌భ నిర్వ‌హించిన ఎన్నిక‌ల‌కు రంగం రెడీ చేసినా.. ఇప్పుడు ఇక‌, పూర్తిస్థాయిలో విజృంభిచ‌నున్నారు. తొలుత అనకాపల్లి జిల్లా నుంచి త‌న ప్రచారం చేప‌ట్ట‌నున్నారు. ఇప్పటికే ఎన్నికల సభలను నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. 'రా కదలిరా' పేరుతో నిర్వహిస్తున్న సభల్లో భాగంగా కార్యకర్తలు, ప్రజలనుద్ధేశించి చంద్రబాబు ప్రసంగిస్తున్నారు.

అయితే.. మ‌ధ్య మ‌ధ్య‌లో గ్యాప్ ఇస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో అనకాపల్లి జిల్లాలో తొలి ఎన్నికల సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 5వ‌ తేదీన అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో సభను నిర్వహిస్తున్నారు. సుమారు రెండు లక్షల మందితో సభను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అనంత‌రం.. ఏలూరు పార్లమెంట్ చింతలపూడిలలో రా కదలి రా సభల్లో పాల్గొంటారు. అదేవిధంగా 6వ తేదీన చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని గంగాధ‌ర‌ నెల్లూరులో రా కదలిరా సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.

ఏంటి ల‌క్ష్యం

ఇప్ప‌టికే స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే.. ఇక‌, పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు చంద్ర‌బాబు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో కేడర్‌లో ఉత్సాహాన్ని నింప‌డంతో పాటు.. ఎన్నిక‌ల వేడి చ‌ల్లార‌కుండా చూసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కొద్దిరోజులు కిందట ఏజెన్సీ పరిధిలోని అరకులో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో గిరిజన ప్రాంతాల్లోని నేతలు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళుతున్నారు.

ఇప్పుడు విశాఖ‌లో నిర్వ‌హించ‌నున్న సభ విజయవంతం అయితే జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో సులభంగా విజయం సాధించేందుకు అవకాశముంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం భారీగా జనాలను సమీకరించే దిశగా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. మండలాలు, గ్రామాలు వారీగా ఉన్న ముఖ్య నాయకులను స‌మాయ‌త్తం చేసి.. స‌భ‌ల‌కు రెడీ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా వైసీపీ సిద్ధం స‌భ‌ల‌కు దీటుగా టీడీపీ స‌భ‌లు నిర్వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం.