చంద్రబాబు ఐటీ స్కాం... రంగంలోకి ఏపీ సీఐడీ!
చంద్రబాబుకు ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసులు, అనంతర పరిణామాల నేపథ్యంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది
By: Tupaki Desk | 6 Sep 2023 5:33 AM GMTచంద్రబాబుకు ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసులు, అనంతర పరిణామాల నేపథ్యంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. పైగా చంద్రబాబు అరెస్టును ఎవరూ ఆపలేరన్న స్థాయిలో వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్న వేళ... ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
అవును... చంద్రబాబు ఐటీ స్కాంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇందులో భాగంగా ఈ విషయంలోకి ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఐటీ స్కాం, స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లలో మూలాలు ఒకేచోట ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చిందని చెబుతున్న నేపథ్యంలో... ఏపీ సీఐడీ విచారణకు సన్నద్ధమైంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఐటీ స్కాం తో పాటు గతంలో సంచలనంగా మారిన స్కిల్ డవలప్ మెంట్ స్కాం లోనూ పాత్రదారులు ఒక్కరే అనే విషయం వెలుగులోకి రావడంతో ఈ సీఐడీ రంగంలోకి దిగిందని అంటున్నారు. ఇందులో భాగంగా... స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాకు, తాజాగా ఐటీ స్కాంలో కీలక వ్యక్తిగా పేర్కొన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని కి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీశాఖ విచారణ జరుపుతోన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాల వ్యవహారం సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ధరలు పెంచి.. ఫలితంగా ఆయా కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి. ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఉన్నాయి!
అయితే అటు తాజా ఐటీ స్కాం లోనూ, ఇటు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలోనూ చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పైనా కీలక అభియోగాలు మోపబడ్డాయి! ఈ రెండు కీలకమైన స్కాంల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాప్తు సంస్థలు అంటున్నాయని తెలుస్తుంది. దీంతో... ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది.
ఇదే సమయంలో దుబాయిలోనూ చంద్రబాబు డబ్బు అందుకున్నట్లుగా అభియోగాలు ఉండటంతో దీనిపై కూడా దృష్టి పెట్టనుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా త్వరలో దుబాయికి విచారణ బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇది మనీల్యాండరింగ్ తో ముడిపడిన విషయం అంటూ ఆరోపిస్తున్న మంత్రులు... దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగాలని కోరుతున్నారు.
దీంతో... ఇప్పుడు ఈ స్కాం ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇన్ కం టాక్స్ తో పాటు ఏపీ సీఐడీ కూడా ఎంటరవ్వడం, త్వరలో దుబాయ్ వెళ్తారనే కథనాలు వస్తుండటంతో మరింతగా ఈ విషయం చర్చనీయాంశం అవుతుంది!