Begin typing your search above and press return to search.

బాబుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే?

గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితం అయింది. ఉమ్మడి ఏపీలోనూ ఇంత తక్కువ సీట్లు ఆ పార్టీకి ఎప్పుడూ రాలేదు

By:  Tupaki Desk   |   12 Sep 2023 6:40 AM GMT
బాబుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే?
X

ఎన్నికలకు ఏడెనిమిది నెలలు కూడా లేని సమయంలో.. ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుతో పరిస్థితులు వేడెక్కాయి. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అక్రమాలు జరిగాయని ఏపీ అధికార పక్షం వాదిస్తుంటే, అక్కడ అసలేమీ లేదని టీడీపీ వాదిస్తోంది. వాస్తవాలను కోర్టుకు వదిలేసి.. విషయంలోకి వస్తే చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. ఆ పార్టీ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించి మరీ ప్రభుత్వం తీరును ఖండిస్తున్నారు. తటస్థుల వ్యాఖ్యలకూ మీడియాలో పెద్దఎత్తున కవరేజీ వస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితిని మరింత మలుపు తిప్పే పరిణామాలు మున్ముందు జరగనున్నాయి. ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన నుంచి రాగానే.. చంద్రబాబు అరెస్టుపై ఏం చెబుతారో చూడాలి. అసలు జగన్ లేని సమయంలో చంద్రబాబు అరెస్టు జరిగిన సంగతిని ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి.

అలాచేస్తే ఎలా ఉంటుందో?

చంద్రబాబు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ లో రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులేమో ఆందోళనలకు దిగుతుంటే.. ఆయన అభిమానులంతా తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. పార్టీపరంగా ఆందోళనలు యథావిధిగా సాగుతున్నప్పటికీ.. లెజిస్లేచర్ పరంగానూ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందులోభాగంగా ఆ పార్టీకి ఉన్న 21 మంది ఎమ్మెల్యేలూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు అవుతుందని పేర్కొంటున్నారు.

23 లో ఇద్దరు లేకున్నా..?

గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితం అయింది. ఉమ్మడి ఏపీలోనూ ఇంత తక్కువ సీట్లు ఆ పార్టీకి ఎప్పుడూ రాలేదు. ఇక వీరిలో ఇద్దరు వైసీపీకి మద్దతు పలికారు. నికరంగా మిగిలింది 21 మంది అని లెక్కేస్తున్నా..వీరిలోనూ కొందరు వైసీపీ సర్కారుకు పరోక్షంగా మద్దతు తెలిపారన్న కథనాలు వచ్చాయి. ఆ తర్వాత అవేమీ ముందుకు సాగలేదు. నిర్ధారణ కాలేదు. కాగా, చంద్రబాబు అరెస్టు నేసథ్యంలో వీరంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఆ వేడి మరో రకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విధంగా రాజీనామాలు చేశారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించేందుకు బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) ఎమ్మెల్యేలు పదవులను త్యజించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

ఇదే సరైన సమయం

ఏపీలో గత ఎన్నికలు 2019 ఏప్రిల్ లో జరిగాయి. ఈ లెక్కన సరిగ్గా ఏడు నెలల సమయమే ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామా చేస్తే ప్రధానంగా ప్రజల్లో చర్చకు నిలుస్తారు. జాతీయ స్థాయిలోనూ ఈ అంశం చర్చనీయాంశం అవుతుంది. మీడియాకూ ఎక్కుతుంది. ఇంకో విషయం ఏమంటే.. సాధారణ ఎన్నికలు అతి సమీపంలోనే ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు. ఏ విధంగా చూసినా టీడీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు సరైన నిర్ణయం. మరి దీనిపై పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.