సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ తాజా పరిస్థితి ఇదే!
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 27 Sep 2023 11:03 AM GMTస్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఏసీబీ కోర్టులోనూ తన రిమాండ్ పై పిటిషన్లు వేశారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ ను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ధర్మాసనంలో ఉన్న తన సహచర జడ్జి ఎస్‌వీ భట్టి ఈ పిటిషన్ ను విచారించడానికి సిద్ధంగా లేరని మరో జడ్జి ఖన్నా తెలిపారు. అయితే చంద్రబాబు తరఫున కేసు వాదిస్తున్న హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూద్రా ఈ పిటిషన్ ను వెంటనే విచారించాలని కోరారు. అయితే వచ్చే వారం చూద్దామని.. సహచర జడ్జి ఎస్‌వీ భట్.. ఈ పిటిషన్ పై విచారించడానికి 'నాట్ బిఫోర్ మి' అంటున్నారని జస్టిస్ ఖన్నా తెలిపారు.
ఈ నేపథ్యంలో సిద్థార్థ లూద్రా ఈ పిటిషన్ ను త్వరగా విచారించాలని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. అయితే ఆయనను మీరు కలవడానికి ఇబ్బంది లేదని.. తాను మాత్రం కేసును వాయిదా వేస్తున్నానని జస్టిస్ ఖన్నా స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణను వాయిదా వేశారు. సోమవారం అయినా వాదనలకు అవకాశం ఇవ్వాలని హరీశ్ సాల్వే కోరారు. అయితే సోమవారం కూడా అవకాశం లేదని.. వచ్చే వారం వింటామని జస్టిస్ ఖన్నా బదులిచ్చారు. ఈ పిటిషన్ ను విచారించడానికి నా సహచర జడ్జి భట్ సిద్ధంగా లేరు కాబట్టి మరో జడ్జితో విచారిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో అక్టోబర్ 2 తర్వాతే విచారణకు రానుంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూద్రా విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవించడంతో అక్టోబర్ 3న విచారణకు ఆయన అంగీకరించారు. దీంతో క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్పీఎల్) అక్టోబర్ 3న విచారణకు రానుంది. జస్టిస్ ఖన్నా, ఎస్‌వీ భట్టి ధర్మాసనం కాకుండా మరో ధర్మాసనం ఈ కేసును విచారిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.