Begin typing your search above and press return to search.

2018లో కారు పార్టీకి వరంగా మారిన బాబు.. ఇప్పుడు శాపం కానున్నారా?

కాలం మహా సిత్రమైనది. ఎప్పుడు ఎలాంటి పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్నది చెప్పటం అంత తేలికైన విషయం కాదు

By:  Tupaki Desk   |   29 Sep 2023 4:30 PM GMT
2018లో కారు పార్టీకి వరంగా మారిన బాబు.. ఇప్పుడు శాపం కానున్నారా?
X

కాలం మహా సిత్రమైనది. ఎప్పుడు ఎలాంటి పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్నది చెప్పటం అంత తేలికైన విషయం కాదు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. కాలం ఎంతలో ఎంతటి మార్పును తీసుకొస్తుందన్న భావన కలిగిస్తుంది. ఐదేళ్ల క్రితం 2018లోప్రభుత్వాన్ని రద్దు చేసి.. కాస్తంత ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ కు అనుకోని వరంగా మారారు చంద్రబాబు.

ఐదేళ్ల కేసీఆర్ పాలనపై అప్పుడప్పుడు విమర్శలు వెల్లువెత్తుతూ.. ఆయన గెలుపు మీద సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వటం.. కాంగ్రెస్ తో కలిసి పొత్తుపెట్టుకోవటం లాంటి నిర్ణయాలతో పాటు.. అవసరానికి మించిన చొరవ మాటలు బాబు నోటినుంచి వచ్చాయి. ఇదే విషయాన్ని బూచిలా చూపించిన కేసీఆర్.. తన ప్రసంగాల్లో చంద్రబాబు తీరును తూర్పార పట్టారు. మొత్తంగా తెలంగాణ ఓటర్లు భావోద్వేగానికి గురై.. గులాబీ బాస్ ను రెండోసారి ముఖ్యమంత్రి కావటంలో కీలకమైంది.

అప్పట్లో తెలంగాణ ప్రజలు.. చంద్రబాబు తమపైనా.. తమ రాష్ట్రంపైనా ఎక్కడ పెత్తనం చేస్తాడన్న సందేహాన్ని రేకెత్తించటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అదే టైంలో సీమాంధ్రులు సైతం తెలంగాణ అధికారపక్షం విషయంలో తమకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శించాల్సి వచ్చింది. దీంతో.. వారు అప్పటి టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపటంతో భారీ అధిక్యతతో ఎన్నికల్ని విజయవంతంగా పూర్తి చేయగలిగారు. అందుకే.. 2018 తెలంగాణ ఎన్నికల్ని నిశితంగా పరిశీలించిన వారంతా.. కేసీఆర్ గెలుపులో చంద్రబాబు కీలకమని అభివర్ణిస్తారు.

తాజాగా మాత్రం స్కిల్ స్కాం ఆరోపణల్లో కేసులు నమోదు చేయటం.. రాజమండ్రి జైల్లో ఉండిపోవటం.. వారాలు గడుస్తున్నా బెయిల్ రాకపోవటంతో చంద్రబాబు మీద సానుభూతి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈసారి తెలంగాణ ప్రజల్లోనూ చంద్రబాబు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అయ్యోపాపం అన్నట్లుగా స్సందిస్తున్న పరిస్థితి. గులాబీ పార్టీకి అత్యంత విధేయులుగా ఉండే సీమాంధ్రుల్లో అత్యధికం బాబు వైపు ఉన్నట్లుగా చెబుతున్నారు.

తమ మనసులోని మాటను బయటకు వెల్లడించకున్నా.. ఎన్నికల వేళలో మాత్రం గతానికి భిన్నమైన తీర్పును ఇచ్చేందుకు సమాయుత్తమవుతుందని చెబుతున్నారు. ఇదంతా కూడా బాబును జైల్లో వారాల తరబడి ఉంచటంతో వస్తున్న సానుభూతిగా చెప్పక తప్పదు. ఇలాంటివేళలోనే.. హైదరాబాద్ లో ఆందోళనలు ఎందుకు? అంటూ ప్రశ్నిస్తునన వైనం పుండు మీద కారం చల్లినట్లుగా మారిందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ తేడాను ఫాంహౌస్ దొర గుర్తిస్తారంటారా?