Begin typing your search above and press return to search.

బాబుకు బెయిల్ ఎప్పుడు? కిందా మీదా పడుతున్న తెలుగు తమ్ముళ్లు

ఇప్పుడు చంద్రబాబును నిందితునిగా చేర్చటం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్న వాదనలో ఎలాంటిబలం ఈ కోర్టుకు కనిపించటం లేదు

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:32 AM GMT
బాబుకు బెయిల్ ఎప్పుడు? కిందా మీదా పడుతున్న తెలుగు తమ్ముళ్లు
X

స్కిల్ స్కాం ఆరోపణలతో అరెస్టు అయిన ఏపీ విపక్ష నేత చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటున్నారు. స్కిల్ స్కాం లెక్కలు ఒక కొలిక్కి వస్తున్నాయన్నంతనే.. మరికొన్ని ఉదంతాలు తెర మీదకు రావటం.. వాటికి సంబంధించిన వాదనలు కోర్టులో చోటు చేసుకోవటం చూసినప్పుడు.. జైలు నుంచి ఆయన విడుదల అంత తేలిగ్గా సాధ్యమయ్యేట్లుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీ ఫైబర్ గ్రిడ్.. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలు.. అంగళ్లు విధ్వంసం కేసులకు సంబంధించి ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు స్పందిస్తూ.. ఆయనకు బెయిల్ మంజూరు చేసే విషయంలో సాధ్యం కాదన్న మాటను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి పేర్కొనటం తెలిసిందే. ఏపీ హైకోర్టులో తాజాగా చోటు చేసుకున్న వాదనల్ని చూసినప్పుడు కలిగే మొదటి సందేహం.. చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారు? అన్నది ప్రశ్నగా మారంది.

చూస్తుండగానే చంద్రబాబు అరెస్టుఅయి.. జైలకు వెళ్లి 4 వారాలకు పైనే కావటంతో.. ఆయన ఎప్పుడు విడుదల అవుతారు? బెయిల్ ఎప్పుడు వచ్చే వీలుందన్నది పెద్ద డౌట్ గా మారింది. ముందస్తు బెయిల్ పై తాజాగా ఏపీ హైకోర్టు స్పందించిన తీరును చూసినప్పుడు.. కేసులపై చేసిన వ్యాఖ్యల్ని గమనించినప్పుడు ఆయనకు అంత తేలిగ్గా బెయిల్ దొరికే అవకాశం కనిపించటం లేదన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది.

టెరా సాఫ్ట్ తో చంద్రబాబుకు ఉన్న సంబంధం.. ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టే విషయంలో చంద్రబాబు చూపించిన శ్రద్ధ తదితర అంశాలపై సీఐడీ పలు లిఖితపూర్వక ఆధారాల్ని కోర్టు ముందు ఉంచింది. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. అప్పటి అధికారుల్ని ప్రభావితం చేయటంతో పాటు.. ఎలాంటి విధి విధానాల్ని పాటించకుండా.. ఎలాంటి పరిశీలన చేయకుండానే సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుతోనే తయారు చేసినట్లుగా పేర్కొన్నారు.

రూ.330 కోట్ల విలువ చేసే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు సంబంధించి నోట్ ఫైళ్లలో ఎలాంటి అభ్యంతరాలు.. ప్రతికూల అభిప్రాయాలను రాయొద్దని తనకు చెప్పినట్లుగా అప్పటి ఎనర్జీ శాఖకు చెందిన కార్యదర్శి నుంచి తీసుకున్న వాంగ్మూలాన్ని సీఐడీ కోర్టు ముందు ఉంచింది. అంతేకాదు.. టెరాసాఫ్ట్ ను బ్లాక్ లిస్టు నుంచి తొలగించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తమకు చెప్పనట్లుగా అప్పటిపౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు ఎదుట ఉంచారు.

ఇవన్నీ చూసిన తర్వాత బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని కోర్టు చెప్పింది. ఇదంతా చూస్తే.. మరికొద్ది నెలల పాటు చంద్రబాబు జైల్లో ఉండేలా పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఇప్పటివరకు బాబు బెయిల్ పై నమ్మకం ఉన్న వారికి సైతం సందేహాలు కలిగేలా.. సోమవారం హైకోర్టు పరిణామాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకు హైకోర్టు న్యాయమూర్తి నోటి నుంచి వచ్చిన మాటల్ని ప్రస్తావిస్తున్నారు.

''ఇప్పుడు చంద్రబాబును నిందితునిగా చేర్చటం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్న వాదనలో ఎలాంటిబలం ఈ కోర్టుకు కనిపించటం లేదు. ప్రజా.. రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. టెరాసాఫ్ట్ కు చంద్రబాబు రూ.114.53 కోట్ల మేర అయాచిత లబ్థి చేకూర్చారన్న ఆరోపణలు.. ఖజానాకు నష్టం కలిగించారన్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకొని.. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయటం సాధ్యం కాదన్నారు. నిధులు ఎక్కడికి వెళ్లాయన్న విషయంపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. అందుకు భంగం కలగకుండా ఉండాలంటే బెయిల్ మంజూరు సాధ్యం కాదని తేల్చారు. ఇదంతా చూసినప్పుడు.. రానున్న రెండు.. మూడు నెలలు చంద్రబాబు జైల్లో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.