Begin typing your search above and press return to search.

బిగ్ న్యూస్... ఏసీబీకోర్టులో చంద్రబాబుకి మరోసారి ఎదురుదెబ్బ!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సుమారు 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Oct 2023 11:56 AM GMT
బిగ్ న్యూస్... ఏసీబీకోర్టులో చంద్రబాబుకి మరోసారి ఎదురుదెబ్బ!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సుమారు 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటినుంచి వస్తోన్న భోజనం, మందులు తీసుకుంటూ చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని జైలు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కోర్టు ఆదేశాలతో జైల్లో చంద్రబాబుకు ఏసీ కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు రిమాండ్ పొడిగించబడింది!

అవును... సుమారు గత నలభై రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా మరో రెండు వారాలు (14 రోజులు) రిమాండ్ ను పొడిగించింది. దీంతో... నవంబర్ 1 వరకూ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండబోతున్నారు!

వాస్తవానికి అక్టోబర్ 5 న పొడిగించిన జ్యుడిషియల్ రిమాండ్ నేటి(గురువారం)తో ముగియనుంది. దీంతో... రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు వర్చువల్ మోడ్ ద్వారా విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సమయంలో జైలులో ఉన్న చంద్రబాబు పరిస్థితిపై ఆరా తీశారు న్యాయమూర్తి. అనంతరం... జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ సీఐడీ సమర్పించిన మెమోరాండంను పరిగణనలోకి తీసుకున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సెప్టెంబర్ 9న అరెస్టైన చంద్రబాబును సెప్టెంబర్ 10 న విజయవాడలోని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆ రోజున చంద్రబాబుకు సెప్టెంబర్ 22వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విదిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అనంతరం సెప్టెంబర్ 22 న రిమాండ్ ను మరో రెండు రోజులు పెంచుతూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సెప్టెంబర్ 22న బాబును వర్చువల్ పద్దతిలో కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

ఆ సమయంలో సెప్టెంబర్ 24న మళ్లీ అక్టోబర్ 5 వరకు రెండోసారి బాబు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఆ తర్వాత మూడోసారి అక్టోబర్ 5 నుంచి 19 వరకు రిమాండ్ పొడిగించగా.. ఇప్పుడు నవంబర్ 1 వరకు పొడిగించింది విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం.

ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి న్యాయస్థానం చంద్రబాబుని ప్రశ్నించింది! దీంతో... జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో... ఏమైనా అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబుకు జడ్జి సూచించారు. అదేవిధంగా చంద్రబాబు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించారు!