Begin typing your search above and press return to search.

చంద్రబాబు కంటికి ఆపరేషన్... జైలు అధికారులు ఏమంటున్నారు?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Oct 2023 5:15 AM GMT
చంద్రబాబు కంటికి ఆపరేషన్... జైలు అధికారులు ఏమంటున్నారు?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9 ఉదయం నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయగా.. 10వ తేదీన విజయవాడలోని ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నాటి నుంచి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్ లో ప్రత్యేక సదుపాయాల మధ్య ఉంటున్నారు.

ఈ సమయంలో గత కొన్ని రోజులుగా చంద్రబాబు ఆరోగ్యంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. చంద్రబాబుకు ఆరోగ్యం ఏమీ బాగా లేదని, ఆయన ఐదు కిలోల బరువు తగ్గారని కథనలొచ్చాయి. అయితే వీటిని జైలు అధికారులు తీవ్రంగా ఖండించారు. జైలుకి వచ్చినప్పటికంటే చంద్రబాబు ఇప్పుడు ఒక కిలో బరువు పెరిగారని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబుకు స్కిన్ అలర్జీ వచ్చిందని, రాజమండ్రి జీజీహెచ్ వైద్యులు ట్రీట్ మెంట్ చేస్తున్నారని తెలిపారు.

నాటి నుంచి చంద్రబాబు ఆరోగ్యంపై రెగ్యులర్ గా హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా ఆయన హార్ట్ బీట్, పల్స్, లంగ్స్, బీపీ మొదలైన వివరాలు వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు చర్మ వ్యాదుల సమస్యతో ఇబ్బందిపడుతున్నారని, ఈ సమయంలో వేడి ఉష్ణోగ్రతల మధ్య ఉండటం మంచిది కాదని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బాబుకు జైల్లో ఏసీ ఏర్పాటు చేశారు అధికారులు.

ఈ నేపథ్యంలో... రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోందని, ఆయన ఆరోగ్య సమస్యల్ని కావాలనే దాచిపెడుతోందని పార్టీ నాయకులు ఆరోపించడం తీవ్రతరం చేశారు! ఈ సమయంలో చంద్రబాబు కంటి ఆపరేషన్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు!

పైగా... చంద్రబాబు కంటి సమస్యలకు చికిత్స అవసరమని ఆయనను పరిశీలించిన ప్రభుత్వ ఆస్పత్రి కంటివైద్యులు నివేదిక ఇచ్చారని... అయితే, ఆయన కంటికి ఇప్పట్లో ఎలాంటి చికిత్స అవసరం లేదన్నట్లుగా ఆ నివేదికను మార్చి ఇవ్వాలని ప్రభుత్వ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు! బాబు హెల్త్ బులిటెన్ లో కంటి సమస్యను ప్రస్థావించడం లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఈ ఆరోపణలు, అభ్యంతరాలపై జైలు అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా... రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు నాలుగు నెలల క్రితం ఒక కంటికి కేటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగిందని.. అయితే, రెండో కంటికి వెంటనే ఆపరేషన్‌ అవసరం లేదని ఆయనను పరిశీలించిన వైద్యులు చెప్పారని తెలిపారు. దీంతో చంద్రబాబు రెండో కంటి ఆపరేషన్ పై క్లారిటీ వచ్చినట్లయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

కాగా... గతంలో, చంద్రబాబుకు డెంగ్యూ దోమలు కుట్టించి చంపాలనుకుంటున్నారని, ఆయనకు స్టెరాయిడ్స్ ఎక్కించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని, ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని, జైల్లో నక్సలైట్లు ఉన్నారని, డ్రోన్ లు తిరుగుతున్నాయని.. టీడీపీ నేతలు రకరకాలా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన జైలు అధికారులు... చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు!