Begin typing your search above and press return to search.

బాబు స్కిల్ స్కాం కేసు సీబీఐకి......?

దాంతో ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు సహా ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది

By:  Tupaki Desk   |   10 Nov 2023 3:46 PM GMT
బాబు స్కిల్ స్కాం కేసు సీబీఐకి......?
X

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్కిల్ డెవల్పమెంట్ స్కాం కేసులో సీబీఏఇ విచారణ కోరుతూ హై కోర్టులో వేసిన కేసు మీద తదుపరి విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసు దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించి ఉందని, అదే విధంగా ఈ కేసులో కీలక ఆధారాలు ఉన్నాయని ఉండవల్లి సీబీఐ విచారణ కోరుతున్నారు.

ఇక ఈ కేసుని సీఐడీ విచారించినపుడే వేల పేజీలతో నివేదికలు తయారు చేసింది. సీబీఐకి వెళ్తే ఏమైనా ఉందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో ఉంది. ఇక ప్రభుత్వ న్యాయవాది మాత్రం ఈ కేసుని సీబీఐ విచారణకు అప్పగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేశారు.

దాంతో ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు సహా ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేయని విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు.

హై కోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంలో జాప్యం ఏంటని కోర్టు ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 29వ తేదీ నాటికి అయినా ప్రతివాదులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయాల్సి ఉంది

ఈ కేసు ఆషామాషీ కాదు, ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని 52 రోజుల పాటు జైలులో కూర్చోబెట్టించిన కేసు. ఇక సీబీఐ వంటి సంస్థ రంగంలోకి దిగితే ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు కేసు సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు.

టీడీపీ మాత్రం క్వాష్ పిటిషన్ మీద సుప్రీం కోర్టులో సానుకూల స్పందన వస్తే చాలు అని చూస్తోంది. ఇపుడు ఉండవల్లి కేసులో కదలికలు మొదలయ్యాయి. ఈ కేసు విషయంలో హై కోర్టు సీరియస్ గానే ఉంది. ప్రతివాదులకు నోటీసులు ఈసారి కచ్చితంగా జారీ చేయాల్సి ఉంది.

ఆ మీదట ఈ కేసులో వారి అభిప్రాయాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలి. ఈ క్రమంలో హై కోర్టు ఈ కేసు విషయంలో ఈ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సీబీఐకి ఈ కేసు వెళ్తే చంద్రబాబు తో పాటు టీడీపీ పీకల్లోతులోకి వెళ్ళినట్లే అంటున్నారు.

ఇక ఈ కేసుతో పాటు మరిన్ని కేసులను కూడా సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ ఉంది. ఏది ఏమైనా ఈ నెల 28న చంద్రబాబు జైలుకు వెళ్తారా లేదా అన్నది క్వాష్ పిటిషన్ మీద ఆధారపడి ఉంది. అక్కడ ఊరట లభించినా లేకపోయినా అది కేవలం టెక్నికల్ గా ఉన్న విషయం. కేసులో బలం ఉందని సీఐడీ అంటోంది. సీబీఐ టేకప్ చేస్తే మాత్రం ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయని అంటున్నారు.