Begin typing your search above and press return to search.

హోమాలు యాగాలు... బాబుకు రాజ్యాధికారం దక్కేనా...!?

అలాంటి చంద్రబాబు ఇపుడు ప్రత్యేకంగా హోమాలు చేయిస్తున్నారు. అలాగే యాగాలను నిర్వహిస్తున్నారు

By:  Tupaki Desk   |   22 Dec 2023 3:30 PM GMT
హోమాలు యాగాలు... బాబుకు రాజ్యాధికారం దక్కేనా...!?
X

టీడీపీ అధినేత చంద్రబాబు అంటే వాస్తవవాదిగా జనాలకు కనిపిస్తారు. ఆయనలో ఆధ్యాత్మికత ఉన్నా తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం దాకానే పరిమితం అవుతూ వస్తున్నారు. బాబుది సుదీర్ఘ రాజకీయ జీవితం. ఆయన ఎపుడూ యాగాలు హోమాలు ప్రత్యేకంగా తన కోసం చేసినట్లుగా లేదు.

అలాంటి చంద్రబాబు ఇపుడు ప్రత్యేకంగా హోమాలు చేయిస్తున్నారు. అలాగే యాగాలను నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు కుటుంబ సమేతంగా యాగాలలో హోమాలలో పాల్గొంటున్నారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలసి సకల దేవతలను ప్రార్ధించనున్నారు.

ఇందులో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీయాగం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రాజ్యప్రాప్తిని కలిగించాలని ఆయన విజయానికి ఎదురులేకుండా ఉండాలని ఆశయంతోనే నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. గతంలో చూస్తే కేసీయార్ రాజశ్యామల యాగం చేసి అధికారాన్ని రెండు సార్లు అందుకున్నారు. జగన్ కూడా రాజశ్యామల యాగం చేసిన తరువాత సీఎం అయ్యారు అన్న ప్రచారం ఉంది.

ఇక తెలంగాణా ఎన్నికల ముందు కూడా పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి రాజశ్యామల యాగం చేశారు అన్న ప్రచారం సాగింది. ఇపుడు చంద్రబాబు కూడా అదే బాటన పడుతున్నారు అని అంటున్నారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో జైలుకు వెళ్ళడం ఇదే మొదటిసారి. అంతే కాదు ఏకంగా ఆయన యాభై రెండు రోజుల పాటు జైలులో ఉండిపోయారు. దాంతో జైలు నుంచి వచ్చిన చంద్రబాబులో ఆధ్యాత్మిక భావనలు రెట్టింపు అయ్యాయని అంటున్నారు. ఆయన తిరుపతితో మొదలెట్టి విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.

సిం హాచలం కూడా వచ్చి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఇలా ఒక వైపు రాజకీయ పర్యటనలు చేస్తూనే మరో వైపు చంద్రబాబు ఆధ్యాత్మిక టూర్లూ చేస్తున్నారు. చంద్రబాబు ఇపుడు ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకుని రావాలని చూస్తున్నారు. అందుకోసం ఆయన ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు. టీడీపీ జనసేన పొత్తు అందులో భాగమే.

అలాగే ఉచిత హామీలు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు ఇచ్చారు. అలాగే ఆయన ఆకర్షణీయమైన మ్యానిఫేస్టోని తయారు చేయడానికి సిద్ధపడుతున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు ఇపుడు హోమాలు యాగాలు చేయడం మాత్రం ఒక సంచలనంగా మారింది. చంద్రబాబు ఈ మూడు రోజుల పాటు మొత్తం అపాయింట్మెంట్స్ ని రద్దు చేసుకున్నారు. పూర్తి దైవ ధ్యానంలోనే గడుపుతున్నారు.

ఈసారి టీడీపీకి అధికారం చాలా ముఖ్యం. చావో రేవో అన్నట్లుగా ఈ ఎన్నికలను తీసుకున్నారు. అధికారం సాధించి తీరాలి ఆరు నూరు అయినా అన్న పట్టుదలతోనే బాబు దేవీదేవతలను కూడా నమ్ముకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి యాగాలు హోమాలు బాబుని రాజుగా చేస్తాయా అన్నది తెలియాలంటే 2024 ఎన్నికల ఫలితాల దాకా ఆగాల్సిందే.