అన్న క్యాంటీన్.. ఐదేళ్ల తర్వాత చంద్రబాబు చేతుల మీదుగా.. స్పెషల్ ఏంటంటే
అన్నా క్యాంటీన్.. ఈ పేరు వినిపిస్తే.. గత టీడీపీ హయాంలో జరిగిన రూ.5కే టిఫిన్, భోజనం పంపిణీ గుర్తుకు వస్తుంది
By: Tupaki Desk | 31 Dec 2023 4:31 AM GMTఅన్నా క్యాంటీన్.. ఈ పేరు వినిపిస్తే.. గత టీడీపీ హయాంలో జరిగిన రూ.5కే టిఫిన్, భోజనం పంపిణీ గుర్తుకు వస్తుంది. కొన్ని లక్షల మంది కార్మికులు, పేదలు.. ఈ క్యాంటీన్ల ద్వారా అత్యంత చౌక ధరలకే కడుపు నింపుకొనే వారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం రాగానే.. అన్నా క్యాంటీన్లకు మూత పడింది. టీడీపీ ప్రవేశ పెట్టిన పథకాలు కావడంతో చాలా వరకు ఆపేసినట్టే.. అన్నా క్యాంటీన్లను కూడా వైసీపీ ఆపేసింది. ఇక, అప్పటి నుంచి అదిగో మళ్లీ మొదలు పెడతాం.. అంటూ సాగదీతే కనిపించింది. ఇప్పుడు ఏకంగా ఎన్నికలు వచ్చేశాయి.
ఇదిలావుంటే.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. అయితే.. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు ఐదేళ్ల కిందట ఎన్నికల సమయంలో ఆయన విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నా క్యాంటీన్‌లో ప్రజలకు ఆహారం వడ్డించారు. అక్కడే ఆయన కూడా భోజనం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కుప్పంలో ప్రారంభించిన క్యాంటీన్‌లో ప్రజలకు అన్నం వడ్డించడంతోపాటు.. ఇక్కడే చంద్రబాబు కూడా భోజనం చేశారు.
గత మూడు రోజులుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవకర్గంలో చేసిన చంద్రబాబు పర్యటన ముగిసింది. ఆఖరి రోజు రాత్రి పొద్దు పోయే వరకు బాబు పర్యటనలో పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించి, తర్వాత నాయకులు, కార్యకర్తలతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.
''ప్రజల ఉత్సాహం చూస్తుంటే వైసీపీని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని ఉత్సాహాన్ని చూస్తున్నా. 35 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేస్తాం. లక్ష మెజారిటీ ఇచ్చి కుప్పం స్థాయిని మరోసారి చాటిచెప్పండి. రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలి. వైకాపా నేతలు హద్దుమీరి అరాచకాలు చేశారు. సైకోతో పోరాడాల్సి రావడం బాధాకరం. రాష్ట్ర ప్రజల కోసం సైకోతో పోరాడతా'' అని చంద్రబాబు స్పష్టం చేశారు.