Begin typing your search above and press return to search.

చంద్రబాబు హామీల్లో ఇది పీక్స్... వాయిస్తున్నారుగా!

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజుల పర్యటన కేడర్‌ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని అంటున్నారు తముళ్లు

By:  Tupaki Desk   |   31 Dec 2023 8:30 AM GMT
చంద్రబాబు హామీల్లో ఇది పీక్స్... వాయిస్తున్నారుగా!
X

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజుల పర్యటన కేడర్‌ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని అంటున్నారు తముళ్లు. పైగా స్కిల్ కేసులో డెవలప్‌మెంట్ స్కాం కేసులో జైలుకు వెళ్లి 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన బాబును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఆ ఉత్సాహంలో మాట్లాడేశారో.. లేక, తనదైన శైలి వాగ్ధానాలను మరోసారి పరిచయం చేయాలనుకున్నారో తెలియదు కానీ... కీలక హామీ ఇచ్చారు బాబు!

అవును... మూడురోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబునాయుడు ఊహించని హామీ ఇచ్చారు! వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, మంచి నీటి సమస్యను రూపుమాపుతామని, సీసీ రోడ్లు వేస్తామని, ఇంటింటికీ నళ్లాలు ఇస్తామనేవి అందరు చెప్పేమాటలే. అయితే ఇప్పటికే సుమారు 35ఏళ్లుగా ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కూడా అదే మాటను తాజాగా చెప్పారు.

ఇందులో భాగంగా... రాబోయే ఎన్నికల్లో తనను కుప్పంలో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇలా ఆ నియోజకవర్గం నుంచి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ.. అందులో 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తాజా ప్రకటనతో ఆశ్చర్యపోవడం కుప్పం ప్రజానికం వంతైందని తెలుస్తుంది.

ఇదే సమయంలో... అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే ఇప్పటికే 7 సార్లు గెలిపించామని. అందులో మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారని గుర్తుచేస్తున్నారు కుప్పం ప్రజలు. దీంతో... కుప్పం నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని తాము చెబుతున్న మాటనే చంద్రబాబు చెప్పారంటూ వైసీపీ నేతలు మైకులందుకున్నారు!

ఈ అభివృద్ధి హామీ సంగతి కాసేపు పక్కనపెడితే... రాబోయే ఎన్నికల్లో తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పంను ప్రపంచంతో అనుసంధానిస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. దీంతో... నవ్విపోదురు గాక నాకేటి అనుకున్నారా అనే కామెంట్లు వినిపించాయి. ఇదే సమయంలో దాన్ని కంటిన్యూ చేస్తూ... కుప్పంలో కూరగాయలు పండించి విదేశాల్లో అమ్మేందుకు ప్రత్యేకంగా విమానాలను వేయిస్తానని హామీ ఇచ్చిపడేశారు బాబు!

దీంతో ఆన్ లైన్ వేదికగా నెటిజన్లు చంద్రబాబు ఒక ఆటాడుకుంటూ ట్రొల్స్ చేస్తున్నారు. కుప్పంను ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయటం ఏమిటో... కాయగూరలు అమ్ముకునేందుకు స్పెషల్ ఫ్లైట్స్ వేయించడం ఏమిటో అర్థంకావటంలేదని వాపోతున్నారు. ఆయన ఎంత ప్రపంచ మేథావి అయితే మాత్రం... కుప్పం ప్రజలు మరీ అంత వెర్రివాళ్లని భావిస్తున్నారా అనే చర్చా మొదలైంది.