Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు సన్ స్ట్రోక్ తప్పదా....!?

కేసీఆర్ తెలంగాణాలో ఎందుకు ఓడిపోయారు అంటే ఒక్క మాటతో చెప్పే ఆన్సర్ కుమారుడు కేటీఆర్ వల్ల అని వస్తుంది

By:  Tupaki Desk   |   10 Jan 2024 3:30 PM GMT
చంద్రబాబుకు సన్ స్ట్రోక్ తప్పదా....!?
X

కేసీఆర్ తెలంగాణాలో ఎందుకు ఓడిపోయారు అంటే ఒక్క మాటతో చెప్పే ఆన్సర్ కుమారుడు కేటీఆర్ వల్ల అని వస్తుంది. కేసీఆర్ తో తెలంగాణా జనాలకు పేచీ లేదు, ఆయనను తెలంగాణా తెచ్చిన నేతగా ఎంతో గౌరవిస్తారు. అయితే అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కేటీఆర్ జోక్యం అతి అవడంతో సొంత పార్టీలోనూ అసంతృప్తి తీవ్రంగా వచ్చింది. అదే టైం లో జనాల్లోనూ కుటుంబ పాలన అంటూ రావడం వల్లనే కేసీఆర్ ఓడారు అన్నది ఒక విస్పష్టమైన విశ్లేషణ.

ఇపుడు సీన్ కట్ చేసి ఏపీకి వస్తే సరిగ్గా అదే రకమైన భావన ఏపీ జనాలలో ఏర్పడేలా టీడీపీలో రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని అంటున్నారు. చంద్రబాబు ఏడున్నర పదుల వయసులో ఉన్నారు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే బాబు అయిదేళ్ల సీఎం అని లోకేష్ చెప్పినా మధ్యలో జరిగే మార్పులు ఎవరూ ఊహించలేరు. సో అలా కచ్చితంగా లోకేష్ ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడానికి బాబు చూస్తారు అన్నది టీడీపీలోనూ బలమైన భావన ఉంది.

అంతే కాదు బయట జనాలల్లోనూ ఉంది. నారా లోకేష్ అన్న వారు ఎవరూ అన్నది టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ గా అన్నారని కాదు, అలాగే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నది కూడా కాదు, ఈ రోజుకు ఈ రోజు బయటకు వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా అదే అంటున్నారు. చంద్రబాబు వరకూ ఓకే అని టీడీపీలో ఎవరైనా సర్దుకుంటారు. బాబుకు పొలిటికల్ గ్లామర్ లేకపోయినా గ్రామర్ ఉంది. పార్టీ పునాదుల నుంచి ఆయన ఉన్నారు.

ఈ రోజు టీడీపీ ఈ స్థితిలో ఉందంటే దానికి బాబు వ్యూహాలే కారణం అని అంతా అంటారు. సో బాబుతో నడిచే వారు టీడీపీలో మెజారిటీ ఉంటారు అదే లోకేష్ తో కలసి ప్రయాణించాలంటే మాత్రం ఆలోచిస్తారు అని అంటారు. దానికి ఒకే ఒక ఉదాహరణ కళ్ల ముందు ఉంది. చంద్రబాబు యాభై రెండు రోజుల పాటు జైలులో ఉంటే లోకేష్ పార్టీని నడపలేకపోయారు అని ఒక విమర్శ ఉంటే ఆయనకూ సీనియర్లకు ఉన్న గ్యాప్ ఆ టైం లో బయటపడింది అని అంటారు.

మరో వైపు చూస్తే మిత్ర పక్షంగా ఉన్న జనసేన నేతలు కూడా లోకేష్ తీరు మీద గుర్రుగా ఉంటున్నారు. చంద్రబాబే సీఎం అని ఆయన ఇటీవల ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెప్పడం మీద ఒక బలమైన సామాజిక వర్గంతో పాటు జనసేన కూడా ఆగ్రహంగా ఉందని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో పార్టీలో విధానపరమైన ప్రకటనలు చంద్రబాబుని కూడా దాటి లోకేష్ చేయడం వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని కూడా అంతా అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే అభ్యర్ధుల ఎంపికలో లోకేష్ జోక్యం ఉందని అంటున్నారు. విజయవాడలో కేశినేని నానిని పక్కన పెట్టి ఆయన సోదరుడిని తేవడం వెనక చంద్రబాబుతో పాటు లోకేష్ ఉన్నారని అంటున్నారు. ఇక టీడీపీలో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. వారంతా లోకేష్ వయసు కంటే తన అనుభవంలో పెద్ద వారు. ఇపుడు చంద్రబాబు పుత్ర ప్రేమతో లోకేష్ ని ముందుకు పెడుతూండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు.

ఏపీ రాజకీయాలకు కీలకమైన విజయవాడలో బిగ్ షాట్ కేశినేని నాని టీడీపీని వీడడం అంటే మామూలు విషయం కాదు. ఆయన వెళ్తూ వెళ్తూ లోకేష్ మీద చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. అంతే కాదు ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ పార్టీని శాసించడం ఏంటి అని నాని వేసిన ఈ ప్రశ్న టీడీపీలో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది అని అంటున్నారు. మొత్తానికి లోకేష్ ఎపిసోడ్ చంద్రబాబుని వచ్చే ఎన్నికల్లో ట్రబుల్ ఇస్తుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.