చంద్రబాబు ఆ కోరికను అయోధ్య రాముడు తీరుస్తారా?
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి
By: Tupaki Desk | 19 Jan 2024 10:30 AM GMTసార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఫైనల్ గా ఒక కన్ క్లూజన్ కి వచ్చేస్తున్న జగన్.. త్వరలో 175 + 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ గురించిన చర్చ విపరీతంగా జరుగుతుంది. కారణం... బాబు మనసులో ఉన్న ఆ కోరికే!!
అవును... గెలుపు అనివార్యం అయిన వేళ.. ఈ ఎన్నికలు టీడీపీకి ఎంత ఇంపార్టెంట్ అనేది స్పష్టంగా తెలిసిన వేళ.. చంద్రబాబు కీలక ఆలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జనసేనతో అధికారికంగా జతకట్టిన ఆయన.. బీజేపీపై కూడా ఆశగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ కూడా చేరితే 2014 ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందని బాబు భావిస్తున్నారని అంటున్నారు.
అయితే టీడీపీతో జతకట్టేందుకు బీజేపీ అధిష్టాణం ఏమాత్రం సుముఖంగా లేదనే చర్చ గత కొంతకాలంగా రాజకీయవర్గాల్లో నడుస్తుంది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టినప్పటికీ... ఇండియా కూటమిలో బాబుకు చోటు దక్కలేదు. ఇలా రెంటికీ చెడ్డరేవటిలా పరిస్థితి మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... బీజేపీతో పొత్తు విషయంలో బాబు దింపుడు కళ్లెం ఆశలతో ఉన్నారని అంటున్నారు.
వాస్తవానికి తమ కూటమిలో బీజేపీ చేరాలని బాబుతో పాటు పవన్ కి మరింత ఎక్కువ కోరిక ఉందని అంటుంటారు. ప్రస్తుతానికి పవన్ ఎన్డీయే కూటమిలో ఉండటంతో... ఏపీలోని తమ కూటమిలో బీజేపీని చేర్చడం వల్ల తనకు మోరల్ వేల్యూస్ ఉన్నాయనే సంకేతాలు జనాల్లోకి పంపించినట్లు అవుతుందని భావిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో చంద్రబాబు మాత్రం బీజేపీతో పొత్తు విషయంలో ఈ నెలాఖరు వరకూ డెడ్ లైన్ పెట్టుకున్నారని అంటున్నారు.
అందులో భాగంగా ఈ నెలాఖరు వరకూ బీజేపీ కోసం ఎదురు చూసి.. వారు ఆసక్తి చూపని విషయంలో కమ్యునిస్టులను వెంటబెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని బాబు ప్లాన్ బీ రెడీ చేసుకున్నారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు చివరి ప్రయత్నంగా ఒక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభం ప్రధాని మోడీ, బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఈ కార్యక్రమానికి హాజరు కావాలని దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇందులో భాగంగా చంద్రబాబు, పవన్ లకు రామజన్మభూమి తీర్ధ ట్రస్ట్ ఆహ్వానించింది. దీంతో ఆ కార్యక్రమానికి హాజరవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని సమాచారం.
ఈ సమయంలో చంద్రబాబుతో పవన్ కూడా అయోధ్యకు వెళ్లబోతున్నారని.. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తుపై ఒక స్పష్టత తెచ్చుకోబోతున్నారని.. తెలుస్తుంది. ఏది ఏమైనా... ఈ పర్యటనలో ఏపీలో జగన్ ను ఎదుర్కొనే టీం ఎవరనేది స్పష్టతవచ్చే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ + జనసేన + బీజేపీ... లేదా... టీడీపీ + జనసేన + వామపక్షాలు?