అధికారులకు చంద్రబాబు హెచ్చరికలు.. విషయం ఏంటి?
ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కనీ వినీ ఎరుగని ఘన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 4 Jun 2024 2:26 PM GMTఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కనీ వినీ ఎరుగని ఘన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. కూటమిగా బీజేపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లిన టీడీపీ.. సీట్లు పంచుకుంది. ఈ క్రమంలో 144 సీట్లలోనే టీడీపీ పోటీ చేసింది. అయితే.. 135 స్థానాలకు పైగా టీడీపీ ఒంటరిగానే దక్కించుకుంది. ఇక, జనసేన పూర్తిగా 21 -స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల విజయం దక్కించుకుంది. ఇలా.. కూటమి భారీ విజయంతో దూసుకుపోయింది. అయితే.. ఈ క్రమంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసేందుకు ఇంకా సమయం ఉంది. మంచి రోజు.. ముహూర్తం కోసం.. వేచి చూస్తున్నారు.
అయితే.. సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వం మారుతుంటే.. ఫైళ్లు ధ్వంసం చేయడం.. మాయంచేయడం అనేవి పరిపాటిగా మారి పోయాయి. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు.. వివాదాస్పద అంశాలకు సంబంధించిన ఫైళ్లను మాయం చేస్తుంటారు. గత 2023లో తెలంగాణ ప్రభుత్వం మారినప్పుడు కూడా ఇలానే చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇది అక్కడ పెద్ద వివాదం అయింది. ఇలాంటి పరిస్థితి ఏపీలోనూ ఎదురయ్యే అవకాశం ఉంటుందని గుర్తించిన టీడీపీఅధినేత, కాబోయే సీఎం చంద్రబాబు.. ముందుగానే ఇలాంటి విషయంపై దృష్టి పెట్టారు.
అనధికారికంగానే ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఏ విభాగం నుంచి ఏ ఒక్క ఫైలు కూడా.. మిస్ కావడానికి వీల్లేదని కఠిన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంతేకాదు.. ఏ ఫైలైనా మిస్సయినా.. ధ్వంసమైనా.. సంబంధింత అధికారులను బాధ్యులను చేసి ఖఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు హెచ్చరించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం.. అత్యంత దారుణమైన స్థితిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు ఈ నెల 9న మంచి ముహూర్తంలో అమరావతిలో ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.