అమరావతి, విశాఖలపై చంద్రబాబు కీలక ప్రకటన!
విశాఖపట్నాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే కర్నూలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
By: Tupaki Desk | 11 Jun 2024 8:17 AM GMTరాష్ట్ర రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు రాష్ట్ర రాజధానిపై కీలక ప్రకటన చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఇక అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందన్నారు. విశాఖపట్నాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే కర్నూలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఇకపై ఉండబోదన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని తేల్చిచెప్పారు. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని పిలుపునిచ్చారు.
విశాఖపట్నాన్ని మరిచిపోబోమని చంద్రబాబు చెప్పారు. విశాఖ సిటీలో నాలుగుకు నాలుగు సీట్లను, ఎంపీ సీటును, జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను ప్రజలు కూటమికి కట్టబెట్టారన్నారు. 2019లో కూడా విశాఖ సిటీలో నాలుగుకు నాలుగు సీట్లలో టీడీపీని గెలిపించారని చెప్పారు. అలాంటి నగరాన్ని తాము మరిచిపోబోమని వెల్లడించారు.
ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ‘స్టేట్ ఫస్ట్’ అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. జగన్ విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తామని చెప్పినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. వద్దు బాబు.. నువ్వు ఇక్కడికి రావద్దు అంటూ తమ ఓట్ల ద్వారా జగన్ కు ప్రజలు తేల్చిచెప్పారన్నారు. విశాఖ రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అంటూ జగన్ చేసిన మోసాలను ప్రజలు గమనించారన్నారు.
పోలవరం పనులు 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. నదులను అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లందిస్తామని వెల్లడించారు.
రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యతను ప్రజలు తమకు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. 1994లో టీడీపీ ఘనవిజయం సాధించినా ఇలా వన్ సైడెడ్ గా సీట్లు రాలేదన్నారు. ఇప్పుడు 175కి 164 సీట్లు గెలిచామని, 11 సీట్లే ఓడిపోయామన్నారు. 93 శాతం స్ట్రైక్ రేటు ఉందన్నారు. ఎంపీ సీట్లలో 25కి 21 గెలిచామని తెలిపారు. ఎప్పుడూ లేనివిధంగా కడపలో 7 సీట్లకు 5 గెలిచామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారన్నారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారన్నారు.
తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. తప్పు చేసినవారిని క్షమిస్తే వారికి అలవాటుగా మారుతుందన్నారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. విధ్వంస, కక్షా రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. పదవి వస్తే విర్రవీగ కూడదని.. వినయంగా ఉండాలన్నారు. శాసనసభలో తన కుటుంబానికి అవమానం జరిగిందని గుర్తు చేశారు.. గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చానన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడుగుపెడతానని చెప్పానని గుర్తు చేశారు. తన శపథాన్ని ప్రజలు నెరవేర్చారన్నారు.