Begin typing your search above and press return to search.

బాబు పక్కన నితీష్...పవన్ పక్కన ఆమె !

మోడీ మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి దేశ విదేశాల నుంచి దాదాపుగా ఎనిమిది వేల మంది దాకా హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 3:49 PM GMT
బాబు పక్కన నితీష్...పవన్ పక్కన ఆమె !
X

మోడీ మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి దేశ విదేశాల నుంచి దాదాపుగా ఎనిమిది వేల మంది దాకా హాజరయ్యారు. సువిశాలమైన రాష్ట్రపతి భవన్ లో సాగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు కదలి వచ్చారు.

మోడీ మంత్రి వర్గం ప్రమాణ స్వీకారాన్ని ఆద్యంతం టీడీపీ అధినేత చంద్రబాబు జేడీయూ అధినేత నితీష్ కుమార్ వీక్షించారు. ఈ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. కొద్ది సేపు మాట్లాడుకుంటూనే మొత్తం కార్యక్రమాన్ని కన్నార్పకుండా చూశారు.

దాంతో అందరి చూపూ ఈ ఇద్దరి మీదనే పడింది. ఎందుకంటే మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణం చేసి సారధ్యం వహిస్తున్న ఎన్డీయే సర్కార్ కి ఈ ఇద్దరే రధ చక్రాలు కావడంతో పలు మార్లు కెమెరాలు ఈ వైపుగానే తిప్పారు. ఈ ఇద్దరూ కూడా పూర్తి ఏకాగ్రతతోనే కార్యక్రమాన్ని తిలకించడం కనిపించింది.

రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న నేతలు బాబు నితీష్. ఈ ఇద్దరూ నరేంద్ర మోడీ కంటే కూడా రాజకీయంగా సీనియర్లు పలు మార్లు ముఖ్యమంత్రులుగా చేసిన వారు. ప్రస్తుతం చేస్తున్న వారు. ఈ ఇద్దరికీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ తలచుకుంటే మోడీ సర్కార్ జోరుగా ముందుకు సాగుతుంది. బ్రేకులు వేస్తే అది పెను సంచలనం అవుతుంది. ఇదిలా ఉంటే నితీష్ చంద్రబాబు మాత్రం మోడీ సర్కార్ కి ప్రస్తుతానికి అభయ హస్తం ఇస్తూ తమ వారిని కేంద్ర మంత్రులుగా చేసుకున్నారు.

రానున్న రోజులలో కేంద్ర ప్రభుత్వం పనితీరుని వీరు ఇద్దరూ క్షుణ్ణంగా ఎప్పటికపుడు మానిటరింగ్ చేస్తారు అని అంటున్నారు. ఇక కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తనకు ఉన్న ఇద్దరు ఎంపీలను అందించిన కీలక నేత జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్. ఆయన కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి సతీ సమేతంగా తరలి వచ్చారు. పవన్ పక్కన సతీమణి అన్నా లెజినోవా కూడా కూర్చుని మొత్తం కార్యక్రమాన్ని తిలకించారు. పలు మార్లు పవన్ వైపు కూడా కెమెరా తిరిగింది. ఆయన పూర్తి ఏకాగ్రతతోనే మొత్తం కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించడం కనిపించింది.