Begin typing your search above and press return to search.

టార్గెట్ రోజా...జగన్ కంటే కూడా ఎక్కువగా...?

సినీ హీరోయిన్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా రాణిస్తున్న వారు ఆర్కే రోజా. అమె తొంబై దశకంలో గ్లామరస్ హీరోయిన్

By:  Tupaki Desk   |   14 Sep 2023 5:18 AM GMT
టార్గెట్ రోజా...జగన్ కంటే కూడా ఎక్కువగా...?
X

సినీ హీరోయిన్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా రాణిస్తున్న వారు ఆర్కే రోజా. అమె తొంబై దశకంలో గ్లామరస్ హీరోయిన్. ఆమె టీడీపీలోనే మొదట రాజకీయ జీవితం మొదలెట్టారు చంద్రబాబు ఆమెకు రెండు సార్లు టికెట్ ఇచ్చారు. అయితే అవి ఎపుడూ ఓడే సీట్లు కావడం వల్లనే తాను ఓడిపోయాను అని రోజా అప్పట్లో విమర్శించారు. చంద్రబాబు అలా తనను ఓడించేందుకే చేశారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక రెండవసారి టీడీపీ 2009 ఎన్నికల్లో ఓడాక ఆమె కాంగ్రెస్ వైపుగా వచ్చారు. వైఎస్సార్ ని కలసి ఆ పార్టీలో చేరేందుకు చూశారు. ఇంతలో ఆయన చనిపోవడంతో ఆయన మరణాంతరం వైసీపీలో చేరి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో తొలిసారి ఆమె నగరి నుంచి గెలిచారు. అయిదేళ్ళ వైసీపీ ప్రతిపక్ష పాత్రలో ఆమె కూడా కీలక భూమిక పోషించారు

అలాగే 2019లో ఆమె రెండవసారి గెలిచారు. మూడేళ్ళ తరువాత మంత్రి కూడా అయ్యారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమె జగన్ పక్షాన నిలిచి టీడీపీ అయినా జనసేన అయినా చీల్చిచెండాడడంతో ముందుంటారు. ఆమె బోల్డ్ గా ఇచ్చే స్టేట్మెంట్స్ పలు మార్లు వివాదాస్పదం అయ్యాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా చంద్రబాబుకు రిమాండ్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు మీద ఆమె నగరిలో పార్టీ వారితో చేసిన డ్యాన్స్, అలాగే స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేయడం ఇపుడు టీడీపీని మండిస్తోంది.

చంద్రబాబు జైలు పాలు కావడం మీద రోజా పవర్ ఫుల్ కామెంట్స్ చేసారు. ఎంతోమందిని ఇబ్బంది పెట్టి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అరెస్ట్ కావడం జైలుపాలు కావడం సబబే అన్నారు. ఇదే మాటను మిగిలిన వైసీపీ నేతలు అన్నారు. కానీ స్వీట్లు పంచి రోడ్ల మీద రోజా డ్యాన్స్ చేయడం మాత్రం ఆమెను టీడీపీకి కన్నెర్ర అయ్యేలా చేసింది అని అంటున్నారు.

దీంతో జగన్ కంటే కూడా ఎక్కువగా ఆమె మీద టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. వరసబెట్టి టీడీపీ నేతలు రోజా మీద తీవ్ర విమర్సలు చేస్తున్నారు గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాత అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే రోజా పొగరుకు ఇత్తడే అవుతుంది అని హెచ్చరించారు. రోజా అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తులు కూడగట్టారని వాటి గుట్టు బయటపెడతామని ఆమె చెప్పడం విశేషం.

ఇక టీడీపీలో ముఖ్య నేత అయిన వర్ల రామయ్య అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడే మూడు నెలలలోనే రోజాను జైలు పాలు చేస్తామని క్లియర్ కట్ గా చెప్పేశారు. రోజా చెన్నైతో పాటు చాలా చోట్ల భూములు కొన్నారని, వాటి లెక్క కూడా తాము తేలుస్తామని చాలా చిట్టా కూడా తమ వద్ద ఉందని ఆయన అంటున్నారు.

ఇదే తీరున చాలా మంది నేతలు రోజా మీద మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కావడం రిమాండ్ కి వెళ్ళడం టీడీపీకి షాక్ గానే ఉంది. ఈ టైం లో వారిని మరింతగా మండించేలా రోజా వైఖరి ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ హిట్ లిస్ట్ లో రోజాను టాప్ ప్లేస్ లో పెట్టేసారు. అయితే భయం లేకుండా రాజకీయంగా దూకుడు గా వ్యవహరించే రోజా దీన్ని కేర్ చేస్తారా అంటే డౌటే అంటున్నారు. టీడీపీ గెలిచినపుడు కదా అన్నది ఆమె అనుచర వర్గం సెటైర్ గా ఉందిట.