బాబు ర్యాలీపై సీఐడీ పిటిషన్... హైకోర్టు కీలక ఆదేశాలు!
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 Oct 2023 11:18 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 52 రొజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు విడుదలవుతుంటే... పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని చెబుతున్నారు.
ఈ సమయంలో సెంట్రల్ జైల్ బయట బాబుకు స్వాగతం పలికేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ముఖ్యనేతలు కొంతమంది రాజమండ్రి చేరుకోనున్నారు. మరోపక్క దూరప్రాంతాల నుంచి రావాల్సిన వారు జిల్లాల నుంచి ఇప్పటికే బయల్దేరారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాబు బయటకు రాగానే బాణసంచా కాలుస్తూ, సంబరాలు చేసుకోవాలని.. అనంతరం రాజమండ్రి టు అమరావతి ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది!
ఇందులో భాగంగా... జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు రాజమండ్రి పాత హైవే మీదుగా బయల్దేరి అమరావతిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్... వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ అని అంటున్నారు. అక్కడ నుంచి కరకట్ట నివాసానికి చేరుకుంటారని అంటున్నారు!
ఈ సమయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబు కాన్వాయ్ వెంట ర్యాలీగా వెళ్లాలని... భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ నినాదాలు చేయాలని... ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో భాగంగా చంద్రబాబు మధ్యంతర బెయిల్ లో మరో ఐదు నిబంధనలు చేర్చాలని కోరింది.
ఇందులో భాగంగా... మధ్యంతర బెయిల్ అనేది ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇచ్చారని గుర్తుచేస్తూ... రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభలు పెట్టొద్దని.. మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని.. కేవలం వైద్యం కోసమే బెయిల్ ను ఉపయోగించాలని.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడొద్దని.. ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ కదలికలను కోర్టుకు సమర్పించాలని కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై తాజాగా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా రేపటి (బుధవారం) వరకూ ఎలాంటి ర్యాలీలూ చేయొద్దని, మీడియాతో మాట్లాడొద్దని చంద్రబాబును ఆదేశించింది. దీంతో... రాజమండ్రి జైల్ పరిసరప్రాంతాల్లో ఏమి జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.