9న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ఏపీలో అఖండ విజయం సొంతం చేసుకున్న టీడీపీ కూటమి విజయోత్సవాల్లో మునిగిపోయింది
By: Tupaki Desk | 4 Jun 2024 4:42 PM GMTఏపీలో అఖండ విజయం సొంతం చేసుకున్న టీడీపీ కూటమి విజయోత్సవాల్లో మునిగిపోయింది. మరోవైపు.. కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు తాము గెలిస్తే.. చంద్రబాబు ఈ నెల 9న అమరావతిలో ప్రమాణం చేస్తారని.. చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా.. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో అమరావతి ప్రాంతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీలు తాజా ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 158 స్థానాలు దక్కించుకున్నాయి. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకార ఘట్టం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. 74 ఏళ్ల చంద్రబాబు ఉమ్మడి ఏపీకి కూడా. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొత్తం 14 ఏళ్లు పైచిలుకు ఆయన తన పాలనతో ఏపీని ముందుకు నడిపించారు. 1995 నుంచి 2004 వరకు ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమి విజయం దక్కించుకుంది. దీంతో విభజిత ఏపీకి తొలిసీఎంగా చంద్రబాబు వ్యవహరించారు.
అయితే.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో గత ఐదేళ్లుగా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. పైగా ఈ సమయంలో అనేక ఇబ్బందులు కూడా పడ్డారు. ఇక, ప్రస్తుత ఎన్నికలకు ముందు ఆయన జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఈ సమయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ.. చంద్రబాబు ముందుకు సాగారు. మొత్తానికి సీట్లు సర్దుబాటు చేసుకుని రాజకీయంగా గేమ్ చేంజర్‌గా మారారు. తాజాగా కడపటి వార్తలు అందే సరికి 135 స్తానాల్లో టీడీపీ ఒంటరిగానే విజయం దక్కించుకుంది. మొత్తం 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ పార్టీ చరిత్రలోనే తొలిసారి 135 స్థానాలు దక్కించుకుని చరిత్ర సృష్టించింది.
ఇక, కుప్పంలోనూ చంద్రబాబు ఘన విజయందక్కించుకున్నారు. 47 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో బాబు విజయం అందుకున్నారు. 1989 నుంచి ఆయన ఇక్కడ ఓటమి ఎరుగని నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ కూడా.. మంగళగిరిలో 91 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. దీంతో గత ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి ఆయన బయట పడ్డారు. ఇక, పార్లమెంటు స్థానాల్లోనూ టీడీపీ 16 స్థానాలు దక్కించుకుంది. మొత్తం 17 చోట్ల పోటీ చేసిన టీడీపీ 16 చోట్ల విజయం సాధించడం గమనార్హం. మిగిలిన మిత్ర పక్షాలతో కలుపుకొంటే ఇది 21వ రకు చేరింది.