Begin typing your search above and press return to search.

చంద్రబాబు చెప్పింది నిజమేనా ?

చంద్రబాబునాయుడు చెప్పిన విషయంపై ఇపుడు బాగా చర్చ జరుగుతోంది. ఇంతకీ చంద్రబాబు ఏమిచెప్పారంటే 40 మంది వైసీపీ ఎంఎల్ఏలు టీడీపీతో టచ్ లో ఉన్నారట.

By:  Tupaki Desk   |   18 Dec 2023 6:27 AM GMT
చంద్రబాబు చెప్పింది నిజమేనా ?
X

చంద్రబాబునాయుడు చెప్పిన విషయంపై ఇపుడు బాగా చర్చ జరుగుతోంది. ఇంతకీ చంద్రబాబు ఏమిచెప్పారంటే 40 మంది వైసీపీ ఎంఎల్ఏలు టీడీపీతో టచ్ లో ఉన్నారట. టికెట్లు రావని ఎవరికి వారుగా కన్ఫర్మ్ చేసుకున్న ఎంఎల్ఏలతో పాటు పక్క నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమితులైన ఎంఎల్ఏల్లో కొందరు జగన్మోహన్ రెడ్డి వైఖరిపైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. దాంతో అలాంటి వాళ్ళంతా టీడీపీలో చేరే ఉద్దేశ్యంతో చంద్రబాబుతో టచ్ లోకి వెళ్ళారట. ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పారు.

టీడీపీలో చేరాలని అనుకుంటున్న వైసీపీ అసంతృప్త ఎంఎల్ఏలు, నేతలు అందరినీ టీడీపీలో చేర్చుకునేదిలేదని చంద్రబాబు ప్రకటించారు. పనితీరు బాగుందని అనుకున్న వాళ్ళని మాత్రమే టీడీపీలో చేర్చుకునే విషయాన్ని ఆలోచిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వివిధ కారణాలతో సుమారు 70 మంది ఎంఎల్ఏలను జగన్ మార్చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో కొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా పోటీచేయించబోతున్నారట. అలాగే మరికొందరు ఎంపీలను ఎంఎల్ఏలుగా పోటీలోకి దింపబోతున్నారట.

మరికొందరు ఎంఎల్ఏలను కొత్త నియోజకవర్గాలకు మార్చి అక్కడినుండి పోటీచేయించబోతున్నారట. చివరగా కొందరు ఎంఎల్ఏలకు అసలు టికెట్లే ఇవ్వనని చెప్పేశారట. ఈ విధంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీలో బాగా మార్పులుంటాయని ప్రచారం జరగుతోంది. ఈ మార్పుల విషయంలో సహజంగానే కొందరికి అసంతృప్తి ఉంటుంది. అయితే జగన్ నిర్ణయాలపై ఎంతటి అసంతృప్తి ఉన్నా చేయగలిగింది పెద్దగా లేదన్నది వాస్తవం. మహాయితే పార్టీకి రాజీనామా చేస్తారంతే. పార్టీకి రాజీనామా చేసి ఏమిచేస్తారు ? చివరి నిముషంలో టీడీపీ లేదా జనసేనలో చేరి టికెట్ తెచ్చుకుంటారా ?

చివరి నిముషంలో వచ్చే వాళ్ళకి చంద్రబాబు టికెట్లిస్తారా ? అవకాశాలు తక్కువనే చెప్పాలి. కాకపోతే చంద్రబాబు చెప్పినట్లుగా 40 మంది ఎంఎల్ఏలు వైసీపీని వదిలేస్తే మాత్రం అధికారపార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని అనుకోవాలి. కానీ అంతమంది ఒకేసారి పార్టీని వదిలేసి ఏమి చేస్తారన్నదే కీలకమైన ప్రశ్న. ఇంతమందిని టీడీపీ లేదా జనసేన చేర్చుకునే అవకాశంలేదు. పోనీ బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరుతారా అనుకుంటే అందుకు కూడా అవకాశాలు తక్కువ. ఎందుకంటే పార్టీ మారుతారని అనుకుంటున్న వాళ్ళంతా మళ్ళీ టికెట్ల కోసమే కదా ప్రయత్నించేది. మరి చంద్రబాబు ప్రకటన ఎలాంటి మార్పులను తెస్తుందో చూడాలి.