Begin typing your search above and press return to search.

అనంతలో లాస్ట్ లిస్ట్ చిచ్చు... భారీగా భగ్గుమన్న అసమ్మతి!

టీడీపీ అభ్యర్థుల తుది జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు.. శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 March 2024 10:57 AM GMT
అనంతలో లాస్ట్ లిస్ట్ చిచ్చు... భారీగా భగ్గుమన్న అసమ్మతి!
X

టీడీపీ అభ్యర్థుల తుది జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు.. శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 9 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో.. మొత్తం 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో... రెండో జాబితా విడుదలైన తర్వాత మొదలైన రచ్చ ఇప్పుడు మరోసారి మొదలైంది.

అవును... టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన అనంతరం అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల అనంతరం.. అనంతపురంలో అసమ్మతి భగ్గుమంది. ఇందులో భాగంగా... అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను ప్రకటించడంతో.. ఆ టిక్కెట్ ను ఆశించిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు.

2014 ఎన్నికల్లో గెలిచి, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రభాకర్ చౌదరి... మరోసారి అర్బన్ టిక్కెట్ ను ఆశించారు. పైగా తనకే టిక్కెట్ కన్ ఫాం అనే సంకేతాలు అందడంతో నియోజకవర్గంలో పనులు కూడా చేసుకుంటున్నారంట! ఈ క్రమంలో అనూహ్యంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరు ప్రకటించడంతో.. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలో... అనంతపురం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, పాంప్లెట్లు తగలబెట్టారు. కార్యాలయం అద్దాలు పగులగొట్టి, ఫర్నిచర్, కంప్యూటర్ల్ ధ్వంసం చేశారు. పార్టీకోసం కష్టపడిన వారికి టిక్కెట్ ఇవ్వకుండా.. డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొందని అంటున్నారు.

కాగా... ఇలాంటి సంఘటనలు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి బయటకు కనిపిస్తే.. మరికొన్ని నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని అనపర్తిలో కూడా వాతావరణం తీవ్రస్థాయిలో వేడెక్కిన సంగతి తెలిసిందే!