అతి అనర్థం.. పుంగనూరు ఘటనలో ఎవరిది తప్పు?
By: Tupaki Desk | 4 Aug 2023 3:38 PM GMTఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో చెలరేగిన ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లదాడి, వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే.. ఎవరికి వారు తమ తప్పులేదని.. ఎదుటి పక్షంపై తోసేసే ప్రయత్నం చేశారు. టీడీపీ-వైసీపీ-పోలీసులు మూడు విభాగాలు కూడా తమ తప్పుకాదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక, బాధితుల విషయానికి వస్తే.. ఈ రెండు పార్టీలతో పాటు పోలీసులు కూడా ఉన్నారు.
ఈ ఘటనలో అందరూ బాధితులు గానే మిగిలారు. పోలీసుల లాఠీ చార్జీలో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యక ర్తలు చేసిన రాళ్ల దాడిలో వైసీపీ కార్యకర్తలు, పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది? తప్పెవరది? అనే సందేహం సహజమే. కానీ, ఏమీడియా సంస్థను చూసినా.. ఏవార్తలు విన్నా.. దీనిపై స్పష్టత లేకుండా పోవడం గమనార్హం.
అతి అనర్థం!
టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమలో ప్రాజెక్టుల విధ్వంసంపై పోరుబాట పేరుతో యాత్ర చేస్తున్నారు. ఇది ఈ నెల 1 నుంచి కొనసాగుతోంది. శుక్రవారం చివరి రోజు. ఆయన తొలుత కర్నూలు, తర్వాత సీఎం జగన్ సొంత జిల్లా కడప.. అనంతరం.. తన సొంత జిల్లా చిత్తూరులోనూ పర్యటనకు రెడీ అయ్యారు. అయితే, షెడ్యూల్‌లో తొలుత పుంగనూరు లేదు. పోలీసులకు ఇచ్చిన షెడ్యూల్ వివరాల్లో.. పుంగనూరు బైపాస్(హైవే) మీదుగా చంద్రబాబు.. చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాలి.
అయితే, కర్నూలు, కడప జిల్లాల్లో వచ్చిన స్పందన చూసిన తర్వాత.. పుంగనూరు టీడీపీ నాయకులు ఇక్కడ కూడా పర్యటించాలని చంద్రబాబును కోరారు. దీంతో ఆయన దారిమధ్యలోనే పుంగనూరు సిటీలో కి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. అయితే.. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. అప్పటికప్పుడు సమాచారం వాట్సాప్ ద్వారా పంపించారు. దీనిని పోలీసులు ఖండించారు. రిటెన్‌గా ఒక రోజు ముందే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.
దీనిని టీడీపీ నాయకులు ఖండించి.. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పర్యటన జరిగి తీరుతుందని తెలిపారు. ఇక, పోలీసుల నుంచి వైసీపీ నాయకులకు సమాచారం అందిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో హైవే నుంచి పుంగనూరు సిటీలోకి వస్తున్న చంద్రబాబును రాకుండా చేయాలనే ఉద్దేశంతో పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను పుంగనూరులోకి అడుగు పెట్టకుండా చేయాలని వైసీపీ నాయకులు.. ఎవరు అడ్డు వచ్చినా.. పుంగనూరులో చంద్రబాబు రోడ్ షో చేయించాలని టీడీపీ నాయకులు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు రహదారిపై తమ వాహనాలు అడ్డు పెట్టి చంద్రబాబు రాకకు రెండు గంటల ముందు నుంచి అడ్డు తగిలారు. దీనిని టీడీపీ కార్యకర్తలు నిలువరించే ప్రయత్నం చేయగా.. పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఇదే అదునుగా వైసీపీ కార్యకర్తలు.. కూడా టీడీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఇక, అక్కడ నుంచి వివాదం ముదిరి.. అన్ని పక్షాలు ఎదురు దాడులు చేసుకున్నాయి. ఇదిలావుంటే.. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు బైపాస్ మీదుగానే చిత్తూరులోకి వెళ్లిపోయారు. ఇదీ.. జరిగింది! అతిగా అందరూ వ్యవహరించడం వల్లే వివాదం ముదిరి.. దాడులు.. రక్త పాతానికి దారి తీసింది.