కేసీఆర్ అనుకున్నారు.. బాబు చేశారు
కానీ తీరా చూస్తే సొంత రాష్ట్రంలోనే పార్టీ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది.
By: Tupaki Desk | 7 Jun 2024 2:30 PM GMTఎన్నో కలలు.. మరెన్నో ఆశలు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని.. మూడో ఫ్రంట్ పెట్టి నేషనల్ పాలిటిక్స్‌లో కీ రోల్ ప్లే చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశపడ్డారు. కానీ తీరా చూస్తే సొంత రాష్ట్రంలోనే పార్టీ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నికల్లో వరుస ఓటములతో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ప్రజల్లోనూ ఆదరణ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలు కేసీఆర్‌కు ఇక కల అనే చెప్పాలి. మరోవైపు కేసీఆర్ అనుకున్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అంతే కాకుండా టీడీపీ 16 ఎంపీ స్థానాలు గెలిచింది. ఇప్పుడు కేంద్రంలో మోడీ మూడోసారి ప్రధాని కావాలంటే.. ఎన్టీయే హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బాబు కీలకంగా మారారు. టీడీపీ గెలిచిన 16 ఎంపీ స్థానాలు బీజేపీకి అత్యంత అవసరం. అందుకే మరోసారి నేషనల్ పాలిటిక్స్‌లో చంద్రబాబు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాము ఎన్డీయే కూటమితోనే ఉన్నామని చెప్పిన బాబు.. మోడీకి మద్దతు ప్రకటించారు. కానీ తమ దగ్గరున్న 16 ఎంపీ స్థానాల కారణంగా బాబుకు కేంద్రంలో వాల్యూ మరింత పెరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు పట్టుబట్టే అవకాశం ఉంది.
మరోవైపు మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని, అప్పుడు కేంద్రాన్ని మెడలు వంచే అవకాశం దక్కుతుందని కేసీఆర్ ప్రచారంలో పేర్కొన్నారు. అంతకంటే ముందు యూపీఏ, ఎన్డీయే కాకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలూ చేశారు. టీఆర్ఎస్‌ను కాస్తా బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజాకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. మహారాష్ట్ర, ఏపీలో పార్టీ కార్యకలాపాలనూ ప్రారంభించారు. కానీ నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమితో పరిస్థితి తలకిందులైంది. ఇక ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒక్క సీటు గెలవకపోవడంతో జాతీయ రాజకీయాలు చేయాలనే కేసీఆర్ కల కూలింది.