జగన్ కి అసలైన స్టార్ క్యాంపెయినర్ చంద్రబాబు ...!?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు వయసు డెబ్బై అయిదేళ్ళు. ఆయన ఇపుడు పరిపూర్ణ మనిషి
By: Tupaki Desk | 23 April 2024 2:45 AM GMTటీడీపీ అధినేత నారా చంద్రబాబు వయసు డెబ్బై అయిదేళ్ళు. ఆయన ఇపుడు పరిపూర్ణ మనిషి. రాజకీయంగా చూసినా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. మూడు సార్లు సీఎం, మరో మూడు సార్లు ప్రతిపక్ష నేత. బాబు లాంటి సీనియర్ మోస్ట్ నుంచి జనాలు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. వాటిని ఆయన రీచ్ అవుతున్నారా అంటే కొంత వరకే అని చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.
చంద్రబాబులో సమస్య ఏమిటి అంటే ఆయన మైక్ అందుకుంటే కనీసంగా గంటన్నరకు పైగా మాట్లాడుతారు. ఆయనకు అది మొదటి నుంచి అలవాటు. కానీ జనాలకు కావాల్సింది మ్యాటర్. అది కూడా వీలైనంతవరకూ షార్ట్ కట్ లో. బాబుది నాలుగు దశాబ్దాల రాజకీయం కావచ్చు. కానీ ఆ రోజులకు ఈ రోజులకూ తేడా చాలా ఉంది. అపుడు ఒక స్పీచ్ ఒక ఊరిలో ఇస్తే పక్క ఊరికి ఏమీ తెలిసేది కాదు. మరుసటి రోజు పేపర్లలోనే చూసుకోవాలి.
ఇపుడు అలా కాదు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా ఎక్కడ మాట్లాడినా వింటున్నారు. దాంతో స్పీచులలో కొత్తదనం ఉండాల్సి ఉంది. అలాగే రాష్ట్ర సమస్యలు ప్రాంతీయ సమస్యలు నియోజకవర్గం సమస్యలు అన్నీ కలసి వాయించేస్తే జనాలకు బోర్ కొడుతుంది. ఇక బాబు స్పీచులలో ఎక్కువగా జగన్ మీద విమర్శలు తిట్ల దండకాలు మాత్రమే ఉంటున్నాయి.
నిజానికి టీడీపీ వేదిక ఆ పార్టీ క్యాడర్ ఏర్పాటు చేసింది. వారు ఎంతో శ్రమకోర్చి ఆ వేదికను అందించారు. దానిని సద్వినియోగం చేసుకోవడం బాబు వంటి నేతకు తెలియనిది కాదు. జగన్ పట్ల విమర్శల జోరు పెంచి నెగిటివిటీని పెంచాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆ వ్యతిరేకత నుంచి అనుకూలతను తమ వైపుగా తిప్పుకుని ఓట్ల పంట పండించుకోవాలని చూస్తున్నారు.
కానీ ప్రతీ ఎన్నికల్లోనూ వ్యతిరేకత ఫ్యాక్టర్ ఉంటుంది అనుకూలత ఫ్యాక్టర్ ఉంటుంది. వ్యతిరేకత ఒక్కటే ఏ పార్టీని గట్టెక్కించదు. ఇక చంద్రబాబు స్పీచులు చూస్తే జగన్ ఏపీకి ఏమీ చేయలేదు అని. ఆయన సర్వం భ్రష్టు పట్టించారు అని. అది ఆయన పర్టీ ఆలోచన కావచ్చు. దాని మీద ఆయన విమర్శలు చేయవచ్చు. అయితే ఆలోచనలు మాత్రం జనాలకే వదిలిపెట్టాలి. ఇదీ పరిస్థితి అని చెప్పేంతవరకూ ఓకే.
కానీ తిట్ల పురాణం లంకించుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అన్నది ఆలోచించాల్సి ఉంది. నిజానికి ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు స్పీచులు అన్నీ కూడా జగన్ మీద హాట్ కామెంట్స్ తోనే సాగుతున్నాయి. చివరలోనో మధ్యలోనూ కొంత అన్నట్లుగా తాము వస్తే అది చేస్తామని ఇది చేస్తామని చెబుతున్నారు. దాని వల్ల ఏమిటి లాభం అన్నది కూడా చర్చగా ఉంది.
ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది. చంద్రబాబు రాజకీయాలకు కొత్త కాదు, ముమ్మారు సీఎం ఆయన. ఆయనకు అది ప్లస్. ఒక విధంగా అందులోనే మైనస్ ఉంది. ఆయన రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారి మాదిరిగా స్పీచు మొత్తం అధికార పార్టీ మీద విమర్శలకు వెచ్చిస్తే జనాలకు టీడీపీ మీద పాజిటివిటీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారో అర్ధం కాదు అంటున్నారు విశ్లేషకులు.
ఇపుడు ఏపీ జనాలు జగన్ పాలనను చంద్రబాబు పాలనను బేరీజు వేసుకునే తీర్పు ఇస్తారు. బాబు అయితే తనకు మరోసారి అవకాశం ఇస్తే చేసేది ఏమిటో చెప్పాలి. అలాగే టీడీపీ గురించి ఆ ప్రభుత్వం గతంలో చేసిన మంచి గురించి ఎక్కువగా వివరించడం వల్లనే లాభం జరుగుతుంది.
బాబు మీటింగ్ కి వచ్చిన వారు తిరిగి వెళ్ళే సమయానికి వారి బుర్రలలో పడాల్సింది టీడీపీ ఏమి చేస్తుంది అన్న విషయాలే. అంతే తప్ప జగన్ మీద విమర్శలు వారి మెదళ్లలో ఎక్కించడం ద్వారా టీడీపీకి ఏమి ప్రయోజనం అన్నది కీలక అంశంగా ఉంది. నెగిటివిటీతో రాజకీయాలు చేసే రోజులు పోయాయని కూడా గ్రహించాలని అంటున్నారు.
ఏపీలో రాజకీయం ఇపుడు చాలా జోరుగా సాగుతోంది. ఏపీ ప్రజలు ప్రతీ ఎన్నికకూ రాటు తేలిపోతున్నారు. వారి తీర్పులలో కూడా ఎంతో వైవిధం విలక్షణత కనిపిస్తోంది. ఇవన్నీ తెలిసి కూడా బాబు లాంటి అనుభవశాలి స్పీచులు వన్ సైడెడ్ గా ఇవ్వడం చూసిన వారు వేస్తున్న సెటైర్లు ఏంటో తెలుసా. జగన్ కి అసలైన స్టార్ క్యాంపెయినర్ చంద్రబాబు అని. ఆయన సభలకు వెళ్తే చాలు జగన్ పేరు వందల సార్లు మారుమోగుతోంది. అలా జగన్ పేరుని జనం బుర్రల్లోకి ఎక్కించిన తరువాత టీడీపీకి యూజ్ ఏంటి. ఆలోచించాల్సిందే కదా.