బాబు దసరా జైలులోనే !
టీడీపీ అధినేత చంద్రబాబుకు దసరా కూడా జైలు గోడల మధ్యనే గడవనుంది. క్వాష్ పిటిషన్ మీద శుక్రవారం ఏమి జరుగుతుందో ఏమో అని అంతా భావించారు
By: Tupaki Desk | 20 Oct 2023 10:34 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు దసరా కూడా జైలు గోడల మధ్యనే గడవనుంది. క్వాష్ పిటిషన్ మీద శుక్రవారం ఏమి జరుగుతుందో ఏమో అని అంతా భావించారు. టీడీపీ నేతలు అయితే ఎంతో ఉత్కంఠను ప్రదర్శించారు. కానీ చివరికి క్వాష్ పిటిషన్ మీద తీర్పు అయితే వెలువడలేదు.
దీంతో బాబుకు దసరా పండుగ కూడా జైలులోనే అని ఫిక్స్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం విషయంలో పెట్టుకున్న క్వాష్ పిటిషన్ మీద విచారణ పూర్తి అయినది. దీని మీద సుప్రీం కోర్టు ఏమి తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠ అయితే ఉంది.
ఇదిలా ఉండగా నవంబర్ 15న ప్రఖ్యాత లాయర్, న్యాయ నిపుణుడు ప్రశాంత్ భూషణ్ 17 ఏ మీద దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సుప్రీం కోర్టులో విచారణ ఉంది అని అంటున్నారు. ప్రశాంత్ భూషణ్ ఏకంగా 17ఏ ఉనికి మీదనే ఈ పిల్ దాఖలు చేశారు. ఈ సవరణ రాజ్యాంగ సమ్మతం కాదు అంటూ ఆయన పిల్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది
అవినీతి కేసులో ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు ప్రారంభించేందుకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసే అక్రమాస్తుల నిరోధక చట్టంలోని రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం మీద విచారణ జరగాల్సి ఉంది. ఒక విధంగా చూస్తే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కి ఇది కొంత అడ్డంకిగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు.
ఎందుకంటే అవినీతి నిరోధక చట్టంలోని సవరణ రాజ్యంగ చెల్లుబాటునే సవాల్ చేస్తూ దాఖలు అయిన పిల్ ఇది. మరి దీని విచారణ కూడా నవంబర్ లో ఉన్నందువల్ల ఆ విచారణ కనుక కొనసాగితే దాని తీర్పు వచ్చేవరకూ కూడా బాబు క్వాష్ పిటిషన్ ఫలితం గురించి ఆగాల్సి ఉంటుందా అన్న చర్చను కూడా న్యాయ నిపుణులు లేవనెత్తుతున్నారు.
మొత్తానికి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద తీర్పు ఎపుడు వస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఈ లోగా దసరా సెలవులు కోర్టుకు రావడంతో అక్టోబర్ 29 దాకా కోర్టులు పనిచేయు. మరో వైపు చూస్తే బాబుకు ఫైంబర్ నెట్ లో ముందస్తు బెయిల్ మీద కూడా ఉపశమనం దక్కలేదు. ఇవన్నీ చూస్తుంటే మాత్రం బాబు మరిన్నాళ్ళు జైలులో ఉండాల్సి రావచ్చు అంటున్నారు.
ఇప్పటికే వినాయకచవితి బాబుకు జైలులో గడచింది, ఇక దసరా కూడా అవుతోంది. దీపావళి కూడా నవంబర్ లో ఉంది. మరి పండుగలు అన్నీ చంద్రుడుకి జైలులోనేనా అన్న చర్చ వస్తోంది. మరో వైపు చంద్రబాబు అన్నాళ్ళు జైలు గోడల మధ్యన ఉండడం కూడా తమ్ముళ్లలో నిరాశను నింపుతోంది అంటున్నారు. ఒక విధంగా టీడీపీకి ఈ పరిణామాలు బిగ్ షాక్ గా పరిణమించనున్నాయని అంటున్నారు.