Begin typing your search above and press return to search.

జగన్ విషయంలో అక్కడే బాబుకు డౌట్ కొడుతోందిట...!?

ఏపీలో మరోసారి ఎన్నికల యుద్ధానికి తెర లేచింది. వరసగా మూడవసారి జగన్ చంద్రబాబు ముఖాముఖీ తలపడుతున్నారు

By:  Tupaki Desk   |   24 March 2024 3:33 AM GMT
జగన్ విషయంలో అక్కడే బాబుకు డౌట్ కొడుతోందిట...!?
X

ఏపీలో మరోసారి ఎన్నికల యుద్ధానికి తెర లేచింది. వరసగా మూడవసారి జగన్ చంద్రబాబు ముఖాముఖీ తలపడుతున్నారు. పొత్తులతో టీడీపీ కూటమి కట్టినా బాబు నాయకత్వంలోనే కూటమి ఎన్నికల సమరానికి దిగుతోంది. జగన్ ఎటూ ఒంటరి పోరుకే సై అంటున్నారు. ఈ ఇద్దరూ 2014 నుంచి ప్రత్యక్ష ఎన్నికల సమరానికి సిద్ధపడితే చెరో సారి విజేతలుగా నిలిచారు. ఈసారి ఎవరు గెలుస్తారు అన్న దానిని బట్టే పై చేయి ఎవరిది అన్నది తెలుస్తుంది అంటున్నారు.

ఇక బాబు జగన్ కంటే వయసులో రెండు దశాబ్దాలు పైగా పెద్దవారు. రాజకీయాల్లో చూస్తే జగన్ ది పదిహేనేళ్ల అనుభవం అయితే బాబుది నలభై అయిదేళ్ళ అనుభవం. ఇల బాబు మూడు సార్లు సీఎం మూడు సార్లు విపక్ష నేతగా ఉంటూ విశేషమైన అనుభవం గడించారు. జగన్ ఒకసారి విపక్ష నేతగా ఒక సారి సీఎం గా ఉన్నారు.

చంద్రబాబు విషయమే తీసుకుంటే ఆయన 1978 నుంచి ఎన్నికలను చూస్తూ వస్తున్నారు. ఇక ఆయన టీడీపీలో చేరాక 1985 నుంచి ఎన్నికల వ్యూహాలను రచిస్తూ గెలుపోటములలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అలా చూసుకుంటే బాబు ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సారధ్యం వహించినట్లుగా లెక్క. అలాగే ఆయన పది ఎంపీ ఎన్నికలకు కూడా ఎన్నికల వ్యూహాలను రచించిన వారుగా ఉన్నారు.

ఇక జాతీయ రాజకీయాలలో 1988 నుంచి ఎన్టీయార్ మాటున ఆ తరువాత 1996 నుంచి తానే స్వయంగా కీలక పాత్ర పోషిస్తున్న వారు. సమకాలీన జాతీయ నాయకులలో చంద్రబాబు తీరు వేరు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ గా చెప్పాలి. బాబు రాజకీయ అనుభవం ఆయన వ్యూహాలు ఎత్తులు అన్నీ కూడా ప్రత్యర్ధులకు అందనివి అని చెబుతూ ఉంటారు.

అయితే 2014లో బాబు జగన్ ని తనదైన వ్యూహాలతో చిత్తు చేశారు. 2019 నాటికి ప్రత్యర్థిని లైట్ తీసుకున్నారు. ఫలితం చేదుగా వచ్చింది. ఈసారి మాత్రం అన్ని అస్త్రశస్త్రాలు సమకూర్చుకుని మరీ దూసుకుని వస్తున్నారు. జగన్ ని ఎక్కడా తక్కువగా అంచనా వేయడం లేదు. పైగా ఆయన ఆలోచనలు వ్యూహాలను పసిగట్టి మరీ ధీటుగా ఎదుర్కోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.

జగన్ రాజకీయం చూస్తే ముక్కుసూటిగా ఉంటుంది. ఆయన సొంత బలం మీద అపారమైన విశ్వాసంతో ఉంటారు. ఆయన ఆలోచనలు కూడా ఎక్కువగా సొంతంగానే ఉంటూ నిర్ణయాలుగా మారుతాయని అంటారు. చంద్రబాబు సొంత నిర్ణయాలు తీసుకున్నా ఇతరులతో చర్చించి కొంత తన నిర్ణయం మీద ప్రభావం చూపేలా చేసుకుంటారు అని అంటారు

ఇక జగన్ రెండు పార్లమెంట్, రెండు అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేశారు. ఆయన జాతీయ రాజకీయాల వైపు చూడరని అంటారు. 22 మంది ఎంపీలు చేతిలో ఉన్నా ఆయన 2019 నుంచి 2024 మధ్య కాలంలో జాతీయ స్థాయిలో పెద్దగా హడావుడి చేయలేదు. ఆయనకు ఏపీయే ముఖ్యం. ఇక జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో చంద్రబాబుకు సంబంధ బాంధవ్యాలు రాజకీయాలకు అతీతంగా ఉంటే జగన్ కి బీజేపీలో మోడీతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉంది అని అంటారు. అంతకు మించి ఆయన ఎవరితోనూ పరిచయాలను పెద్దగా పెంచుకోలేదు అని అంటారు.

ఇలా ఇద్దరి మధ్య చాలా విషయాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు ఢీ కొడుతున్న కీలక ఎన్నిక మాత్రం ఏపీలో మే 13న జరగబోతోంది. చంద్రబాబు అంతా సిద్ధం చేసుకున్నా రెండు విషయాల్లో జగన్ మీద డౌట్ తో ఉన్నారని అంటున్నారు. అదే ఆయన అధికార బలం. అలాగే ధన బలం.

ఈ రెండు విషయాలలో జగన్ పై చేయి సాధించి ఎన్నికలను తనకు అనుకూలంగా మలుపు తిప్పుకుంటారేమో అన్న కలవరం అయితే టీడీపీ పెద్దలకు ఉంది అని అంటారు. జగన్ అధికార బలానికి కొంత బ్రేక్ వేయడానికి ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే జగన్ ది డైరెక్ట్ అధికారం. బీజేపీ పెద్దల నుంచి బాబు అడిగి ఒప్పించి తీసుకోవాల్సింది సహకారం.

ఇక్కడే పెద్ద తేడా ఉంది. అందువల్ల పొత్తులు ఉన్నా కేంద్రం ఏపీలో జగన్ ని ఎంతవరకూ కట్టడి చేస్తుంది అన్నది ఒక పెద్ద డౌట్ గానే ఉంది అని అంటున్నారు. దానికి తోడు ధన బలం. ఈసారి ధన ప్రవాహం వైసీపీ వైపు నుంచి ఎక్కువగా ప్రవహిస్తుంది అన్నది చంద్రబాబు మరో ఆలోచన. పైగా ముందు జాగ్రత్త కూడా. అందుకే సామాజిక సమీకరణలను సైతం పక్కన పెట్టి చంద్రబాబు బలవంతులైన వారికే టికెట్లు ఇచ్చారు అని అంటారు.

టీడీపీలో కూడా అదే విమర్శ ఉంది. కానీ బాబు తెలివిగానే ఈ పని చేశారు అని ఆయన రాజకీయ వ్యూహం తెలిసిన వారు అంటున్నారు. జగన్ ని ఆయన ధన బలాన్ని తట్టుకోవాలంటే ఇలాగే చేయాలని అంటున్న వారూ ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అభ్యర్ధులతో నిర్వహించిన వర్క్ షాప్ లో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలో వేయి రూపాయలను రద్దు చేసిన తరహాలో అయిదు వందలు రెండు వందల నోట్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని వల్ల డిజిటల్ పే మెంట్స్ అమలులోకి వచ్చి ఎన్నికల్లో ధనస్వామ్యం లేకుండా పోతుందని అన్నారు. ఇదే సందర్భంలో వైసీపీ మీద కూడా ఆయన విమర్శలు చేశారు. విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు అని అన్నారు.

ఇక ఇప్పటికే రెండు వేల నోట్లు రద్దు అయ్యాయి. అయిదు వందలు రెండు వందలు రద్దు చేస్తే ఇబ్బందులు వస్తాయనే ఆపారని అంటున్నారు. బాబు మమూలు వేళలో ఈ డిమాండ్ చేయకుండా ఎన్నికల వేళ మాట్లాడడమే ఇపుడు చర్చకు కారణం అవుతోంది. నిజంగా ఏపీలో ఆ స్థాయిలో ధనబలంతో ఎన్నికలు జరుగుతాయా అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది. జగన్ గెలిస్తే ఆ రెండు అంశాలే కారణం తప్ప మరేమీ కావని బాబు భావిస్తూ వాటినే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. మరి ఏపీలో అలాంటి స్థితి ఉందా. వైసీపీయే అధికార ధన బలాన్ని ఉపయోగిస్తుందా టీడీపీ చేతులు ముడుచుకుని కూర్చుంటుందా అంటే వెయిట్ అండ్ సీ.