Begin typing your search above and press return to search.

జగన్ ఆయువుపట్టు మీద దెబ్బ కొట్టబోతున్న బాబు ?

ఏపీలో రాజకీయంగా వైసీపీ ఉనికిని లేకుండా చేయాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ గా ఉంది

By:  Tupaki Desk   |   30 Jun 2024 2:30 AM GMT
జగన్ ఆయువుపట్టు మీద దెబ్బ కొట్టబోతున్న బాబు ?
X

ఏపీలో రాజకీయంగా వైసీపీ ఉనికిని లేకుండా చేయాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ గా ఉంది. వైసీపీ ఓడినా నలభై శాతం ఓటు షేర్ తో ఉంది. అందువల్ల ఆ పార్టీని ఈ అయిదేళ్లలో వీలైనంతవరకూ దెబ్బ కొడితే 2029 ఎన్నికలకు ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చు అని బాబు వ్యూహరచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీకి శాసనమండలిలో బలం ఉంది. ఏకంగా 38 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా శాసనమండలిలో కీలకం. అక్కడ మెజారిటీ ఉన్న వైసీపీ టీడీపీ బిల్లులకు అడ్డుపడడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే 2019 నుంచి 2022 దాకా మూడేళ్ళ పాటు వైసీపీకి మెజారిటీ రాని టైంలో టీడీపీ అనుసరించిన రాజకీయ వ్యూహాన్నే ఇపుడు జగన్ అనుసరిస్తారు అన్న మాట.

దాంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు అమరావతి రాజధాని కోసం తీసుకువచ్చే కీలకమైన బిల్లులతో పాటు ఆర్ ఫైవ్ జోన్ లో పేదలకు ఇచ్చే ఇళ్ళను రద్దు చేయడం వంటి వాటికి శాసనమండలిలో ఆమోదముద్ర పడదని అంటున్నారు. జగన్ గట్టిగా ఫోకస్ పెట్టి బిల్లులను అడ్డుకుంటారు అని అంటున్నారు.

అయితే దానికి విరుగుడు మంత్రాన్ని చంద్రబాబు రచించి ఉంచారు అని అంటున్నారు. అవసరం అయితే శాసనమండలి రద్దు చేయాలన్న కఠిన నిర్ణయానికి సైతం ఆయన వెరవక పోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే మూడేళ్ల కాలం వరకూ అక్కడ టీడీపీకి మెజారిటీ రాదు. అంతవరకూ వేచి చూస్తే పాలనపరంగా కీలక బిల్లులు ఇబ్బందులో పడతాయి. రాజకీయంగా చూస్తే మూడేళ్ల పాటు ఎమ్మెల్సీలుగా వైసీపీ వారు ఉంటే రాజకీయంగా పట్టు సాధిస్తారు. ఆ తరువాత ప్రభుత్వ వ్యతిరేకత ఎటూ వస్తుందని దాంతో వైసీపీ బలం పెంచుకుంటుందని ఆలోచిస్తున్నారు.

ఈ నేపధ్యంలో తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో శాసనమండలిని రద్దు చేయించేందుకు బాబు చూస్తున్నారు అని అంటున్నారు. అయితే టీడీపీ సీనియర్లు మాత్రం ఆ ఆలోచన మానుకోవాలని కోరుతున్నారుట. ఎందుకంటే రానున్న కాలంలో టీడీపీకి మెజారిటీ వస్తుందని పైగా అనేక మంది ఆశావహులు పార్టీని అట్టిపెట్టుకుని ఉన్నారని వారందరికీ రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలంటే శాసనమండలి మించినది లేదని చెబుతున్నారుట.

అయితే ఈ రెండూ కాకుండా మరో ఆలోచన కూడా బాబు మదిలో మెదులుతోందిట. అదే కొత్తగా ఉంది. దేశంలో ఇప్పటిదాకా అది అమలు అయిందో లేదో కూడా తెలియదు. అదేంటి అంటే శాసనమండలికి సుప్త చేతనవస్థలో ఉంచడం అంటే మండలి ఉంటుంది కానీ ఇనాక్టివ్ గా ఉంటుంది. ఆ విధంగా చేసేందుకు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్న దాని మీద రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నారుట.

అయితే ఆ విధంగా ఒక సభను ఏళ్ల పాటు ఇనాక్టివ్ గా చేసేందుకు ఎంతవరకూ అవకాశాలు ఉంటాయన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒక సభను ఇనాక్టివ్ గా ఉంచేందుకు రాజ్యాంగంలో చోటు లేదు. అందువల్ల అంతిమంగా శాసనమండలి రద్దు చేయడమా లేక కొనసాగించడమా అన్నదే చూడాల్సి ఉంది. వీటితో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున ఫిరాయింపులకు గురి చేసి చేర్చుకుంటే మెజారిటీ వస్తుంది అన్న ఆలోచన ఉంది. మరి వీటిలో ఏది బాబు అమలు చేస్తారు అన్నది తెలియదు కానీ వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికే డిసైడి అయినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.