Begin typing your search above and press return to search.

4వసారి సీఎంగా తొలిసంతకం... చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ క్రమంలోనే తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చేసే తొలిసంతకంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   27 March 2024 4:49 AM GMT
4వసారి సీఎంగా తొలిసంతకం... చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
X

సాదారణంగా ఎవరైనా పని పూర్తికాకుండానే.. పని తర్వాత వచ్చే ఫలితం తర్వాత చేసే పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే... ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతను వాడతారు. కానీ... రాజకీయాల్లో అలా కాదు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తాము.. ఎలా చేస్తాము అనే విషయాలు చెప్పి తీరాలి. ఈ క్రమంలోనే తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చేసే తొలిసంతకంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు... నాలుగో సారి ముఖ్యమంత్రి అయితే చేసే పనులపై ఇప్పటికే పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తన సొంత నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పాటు.. పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారు. ఐటీ స్థానంలో ఏఐ ప్రస్థావన కూడా లేవనెత్తారు!

ఈ సమయంలోనే.. రానున్న ఎన్నికల్లో కూటమి గెలిచిన అనంతరం తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసంతకం మెగా డీఎస్సీ పై చేస్తానని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... "మెగా డీఎస్సీపై యువతకు భరోసా ఇస్తున్నా.. కూటమి అధికారంలొకి రాగానే తొలిరోజే, తొలి సంతకం డీఎస్సీపై చేస్తా.. అధికారం చేపట్టిన 60 రోజుల్లో డీఎస్సీ ఉంటుంది అని తనదైన స్టైల్లో హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో యువత వెళ్లి.. “ఇప్పుడు డీఎస్సీ వద్దు, ఎన్నికలు అయ్యాక జరిపించండి” అని ఎన్నికల సంఘాన్ని కోరమని చంద్రబాబు పిలుపునిచ్చారు! తాము కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి డీఎస్సీపై మాట్లాడతామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకేసారి ఏకంగా మెగా డీఎస్సీనే జరుపుతామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదని.. వాలంటీర్ల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని అన్నారు!

ఇదే సమయంలో వాలంటీర్ల ప్రస్థావన తెచ్చిన చంద్రబాబు.. ఆ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే వారి ఉద్యోగాలు తీయమని, పైగా మెరుగైన జీతాలు ఇస్తామని ప్రకటించారు! ఇంజినీరింగ్ పూర్తిచేసి వాలంటీర్లుగా పనిచేస్తున్నవారంతా బయటకు రావాలని.. స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా వారికి శిక్షణ ఇచ్చి ఇంటి నుంచే రూ. 30 వేల నుంచి 50 వేల వరకూ సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతామని అన్నారు.