చంద్రబాబుపై తెలంగాణలో కేసు నమోదు... స్వయంగా ఎస్ఐ ఫిర్యాదు!
గతకొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీలో వరుస కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Nov 2023 11:13 AM GMTగతకొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీలో వరుస కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే స్కిల్ డెవప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇటీవల ఆరోగ్య కారణాలతో లభించిన మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చారు. వీటికి తోడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసు, ఏపీ లిక్కర్ స్కాం కేసు, అంగళ్లు అల్లర్ల కేసు... ఇలా వరుస కేసులు చంద్రబాబుపై ఉన్నాయి.
ఇవన్నీ పలు కోర్టుల్లో వివిద దశల్లో ఉండగా.. అంగళ్లు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ కూడా లభించింది. స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంలో ఉంది. దీనిపై తీర్పు ఈ నెల 8న రాబోతుంది. ఈ సమయంలో ఆరోగ్య కారణాల రీత్యా బాబు బయటకు వచ్చారు. కంటికి ఆపరేషన్ చేయించుకుని, మిగిలిన చర్మ వ్యాదులకు కూడా ట్రీట్ మెంట్ తీసుకుని.. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలలోపు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది!
ఈ పరిస్థితుల్లో బాబుపై మరోకేసు నమోదైంది. అయితే ఈసారి తెలంగాణలో కావడం గమనార్హం. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబునాయుడు అనుమతి లేకుండా హైదరాబాద్ లో ర్యాలీ చేపట్టారు! ఇందులో భాగంగా... బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వరకూ ర్యాలీగా వెళ్లారు. దీంతో... ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు!
ఇదే సమయంలో... చంద్రబాబుతో పాటు హైదరాబాద్ నగర టీడీపీ జనరల్ సెక్రటరీ జీవీజీ నాయుడు తదితరులపై కూడా కేసు నమోదైంది. ఈ మేరకు... ర్యాలీలో సుమారు 400 మంది పాల్గొన్నారని.. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని.. ఫలితంగా నగరంలో న్యూసెన్స్ క్రియేట్ చేశారని ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో... ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
కాగా... స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు... అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మొదట ఉండవల్లిలోని ఇంటికి వెళ్లారు అనంతరం ప్రత్యేకవిమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి ర్యాలీ చేపట్టడంతో నగర వాసులు నరకం చూశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది!
వాస్తవానికి హైదరాబాద్ లో సాధారణ సమయాల్లోనే ర్యాలీలు, నిరసనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి! ఈ సమయంలో... ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీని ప్రకారం టీడీపీ తెలంగాణలో పోటీ చేయకపోయినా రిటర్నింగ్ అధికారి నుంచి ర్యాలీకి అనుమతి పొందాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. దీనికోసం 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి. అయితే టీడీపీ నేతలు ఆ పని చేయలేదు!