బాబుకు సడెన్ గా భద్రత పెంపు... దేనికి సంకేతం ?
టీడీపీ అధినేత చంద్రబాబుకు సడెన్ గా భద్రతను పెంచుతూ కేంద్రం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది
By: Tupaki Desk | 16 May 2024 6:29 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు సడెన్ గా భద్రతను పెంచుతూ కేంద్రం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్స్ లో ఒకరు. ఆయన మూడు సార్లు సీఎం గా పనిచేశారు. మరో మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన హోరా హోరీ పోరాడారు. మండుటెండలలో సైతం ఏమీ లెక్కచేయకుండా తిరిగారు. ఇక బాబు ప్రసంగాలు కూడా ఈసారి వేరే లెవెల్ లో సాగాయి. ప్రత్యర్థులను ఆయన చెడుగుడు ఆడించారు. ఆయన మాటలతో పదునైన విమర్శలతో అగ్గి రేపారు.
ఈసారి ఎన్నికలు టీడీపీకి లైఫ్ అండ్ డెత్ కావడంతో బాబు మొత్తానికి మొత్తం ఎఫెర్ట్స్ ని పెట్టేశారు అని చెప్పాలి. ఇక పోలింగ్ రోజు నుంచి మొదలైన హింస ఏపీలో ఈ రోజుకూ సాగుతోంది. ఏపీలో పలు ప్రాంతాలు ఇప్పటికీ మండుతున్నాయి.
దాంతో ఎపుడు ఎవరికి ఏ రకమైన ప్రమాదం పొంచి ఉందో అర్ధం కావడంలేదు. దాంతో కేంద్రం సడెన్ గా బాబుకు భద్రత పెంచేసింది. ఏపీలో ఇపుడు ఉన్న రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న నేపధ్యంలో చంద్రబాబు నాయుడుకి భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు చంద్రబాబు నివాసం వరకు 12 ×12 రెండు బ్యాచులు గా 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు.
దీనికి ముందు బాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, కరకట్ట వద్ద, చంద్రబాబు నాయుడు నివాసం వద్ద, అలాగే గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అలాగే బాబు నివాసం వద్ద కూడా కేంద్ర అధికారులు గత రెండు రోజులుగా పరిశీలించి ఆయన ఎక్కడెక్కడ తిరుగుతారు ఆయా ప్రాంతాలలో ఉన్న భద్రతాపరమైన సమస్యలు ఏమిటి అన్నది గుర్తించి మరీ కేంద్ర హోం శాఖకు నివేదిక పంపడంతో బాబుకు భద్రత అమాంతం పెరిగింది.
అయితే బాబుకు ముప్పు పొంచి ఉందని గతంలో కూడా కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చాయి. దానికి తగినట్లుగా అప్పట్లో కూడా ఆయన భద్రతను పెంచారు. ఈసారి మరింత కట్టుదిట్టం చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన కచ్చితమైన సమాచారం తోనే కేంద్ర హోం శాఖ బాబుకు భద్రత పెంచాలని కీలక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియడం లేదు. కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద మాత్రం ఒక కచ్చితమైన సమాచారం ఉంది అని అంటున్నారు. దాని ప్రకారం కూడా అన్నీ ఆలోచించి బాబుకు భద్రతను పెంచారని అంటున్నారు. రానున్న రోజులలో ఏపీలో మరింతగా గొడవలు జరుగుతాయన్న సమాచారం కూడా ఉండడంతో కేంద్ర బలగాలను కూడా ఏపీలో కంటిన్యూ చేస్తున్నారు. మొత్తానికి కనీ వినీ ఎరగని తీరున ఏపీలో పోలింగ్ రోజు నుంచి హింస పెద్ద ఎత్తున సాగుతోంది. దీని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో చూదాల్సి ఉంది.