చంద్రబాబుకు సీఐడీ మరో షాక్!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Nov 2023 12:08 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబుపై మద్యం టెండర్ల కేసు పెట్టిన ఏపీ సిఐడి అధికారులు తాజాగా ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా వేగం పెంచారు. ఈ కేసులో దూకుడు పెంచిన సిఐడి అధికారులు...చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులను అటాచ్ చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు సన్నిహితులకు సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేసేందుకు ఏపీ హోంశాఖ కూడా సిఐడి అధికారులకు పచ్చ జెండా ఊపింది.
ఈ క్రమంలోనే ఏసీబీ స్పెషల్ కోర్టులో అనుమతి కోరుతూ సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. గుంటూరులోనే ఓ ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఫ్లాట్, హైదరాబాదులో నాలుగు ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ భూమి తదితర ఆస్తులను అటాచ్ చేసేందుకు హోం శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే, సిఐడి పిటిషన్ పై విజయవాడ ఏసిబి కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం వైద్య పరీక్షల కోసం వెళ్లారు. బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి జూబ్లీహిల్స్ కు చేరుకున్న చంద్రబాబును వైద్యుల బృందం పరీక్షించింది. గురువారం నాడు ఆసుపత్రికి రావాలని, మరిన్ని పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత అక్కడ నుంచి చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లి మరిన్ని వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.